Sunday, January 5, 2025

కొత్త సంవత్సరం వేడుకలో మారణకాండ

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరం తొలిరోజున యూరప్ లోని మాంటెనెగ్రో దేశం సెంటెంజీ పట్టణంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడి మారణకాండ సృష్టించాడు. ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మాంటెనెగ్రో దేశ మంతా ఈ కాల్పుల బీభత్సానికి దిగ్భ్రాంతి చెందింది. ఈ మారణ కాండకు సంతాపంగా ఆ దేశ ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దేశం మొత్తం మీద నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసింది. ఆయుధాలపై పూర్తిగా నిషేధం విధించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దేశ ప్రధాని మిలోజ్కో స్పాజిక్ వెల్లడించారు. నూతన సంవత్సరం సెలవు రోజును ఆనందంగా గడపడానికి బదులు విషాదంతో ఉండవలసి వచ్చిందని దేశాధ్యక్షుడు జకోవ్ మిలటోవిక్ విచారం వెలిబుచ్చారు. యూరప్ లోని చిన్నదేశమైన మాంటెనెగ్రోలో ఆ దేశ కాలమాన ప్రకారం నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

రాజధాని పాడ్గోరికాకు 38 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంది. కొత్త ఏడాది వేడుకల్లో అందరూ మునిగి ఉన్న సమయంలో సాయుధుడైన దుండగుడు ఓ రెస్టారెంట్‌లో మొదట కాల్పులు జరిపాడు.అక్కడి బార్ యజమానిని, యజమాని పిల్లలను, కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. అక్కడ నుంచి పారిపోయి మరో రెండు చోట్ల కాల్పులకు పాల్పడ్డాడు. మొత్తం ఈ మూడు సంఘటనల్లో 12 మంది బలైపోయారు. నిందితుడు 45 సంవత్సరాల అలెగ్జాండర్ మార్టినోవిక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీస్‌లు గాలించగా గంట తరువాత అతడు నివసిస్తోన్న ఫ్లాట్‌లో దొరికాడు. అయితే తరువాత తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు దేశ అంతరంగిక మంత్రి డేనిలో సరనోవిక్ చెప్పారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడని తెలిపారు. నిందితుడు స్థానికుడేనని , గతంలో అక్రమంగా మారణాయుధాలు విక్రయించిన రికార్డు ఉందని పోలీస్‌లు చెప్పారు. 2005 లో నేరారోపణలపై శిక్ష కూడా కొన్నాళ్లు పొందాడు. ఈ హత్యలతో సెంటింజే నగరమంతా తీవ్ర భయభ్రాంతులకు గురైంది. నిందితుడు అంతకు ముందు బార్ లోనే రోజంతా అతిధులతో గడిపాడని అధికారులు తెలిపారు.

ఈ సంఘటనపై ప్రాసిక్యూటర్ యాండ్రిజానా నాస్టిక్ గురువారం వివరిస్తూ కాల్పులకు పాల్పడే సమయంలో నిందితుడు ఆరు ప్రాంతాలకు వెళ్లాడని చెప్పారు. బార్ వద్ద నలుగురిని కాల్చి చంపిన తరువాత మరో చోటికి వెళ్లి మరో నలుగురిని చంపాడని, మూడో ప్రాంతంలో ఇద్దరు పిల్లలను హత్య చేశాడని, ఆ తరువాత రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని చంపాడని ప్రాసిక్యూటర్ వివరించారు. ఈ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో దర్యాప్తులో తెలుస్తాయని పేర్కొన్నారు. సముద్ర తీరంలో చిన్న దేశమైన మాంటెనెగ్రోలో మొత్తం జనాభా 6,20,000 వరకు ఉంటారు. తుపాకీ సంస్కృతికి పేరు పొందిన ఈ దేశంలో చాలామందికి ఆయుధాలు కలిగి ఉండడం సంప్రదాయంగా వస్తోంది. 2022 ఆగస్టులో మాంటెనెగ్రో చారిత్రక రాజధాని సెంటింజేలో సాయుధుడైన దుండగుడు ఒకరు పదిమందిని కాల్చి చంపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News