Monday, December 23, 2024

రాజ్యసభ ఎంపీల్లో 12 శాతం మంది బిలియనీర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 12 శాతం మంది వంద కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వారున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనుంచే అత్యధిక శాతం మంది అలాంటి వాళ్లున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎడిఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ కలసి రాజ్యసభలోని 233 మంది ఎంపీల్లో 225 మంది క్రిమినల్, ఆర్థి, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించాయి. ప్రస్తుత రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 11 మంది రాజ్యసభ ఎంపీల్లో ఐదుగురు(45 శాతం), తెలంగాణలోని ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు(43 శాతం), మహారాష్ట్రలోని 19 మంది ఎంపీల్లో ముగ్గురు(16 శాతం), ఢిల్లీలోని ముగ్గురు ఎంపీల్లో ఒకరు(33 శాతం), పంజాబ్‌లోని ఏడుగరు ఎంపీల్లో ఇద్దరు(29 శాతం), హర్యానాకు చెందిన ఐదుగురు ఎంపీల్లో ఇద్దరు(18 శాతం), మధ్యప్రదేశ్‌కు చెందిన 11 మందిలో ఇద్దరు(18 శాతం) రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు.

తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తులు రూ.5,596 కోట్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల మొత్తం ఆస్తులు రూ. 3,823 కోట్లుగా ఉన్నాయి. కాగా యుపికి చెందిన 30 మంది ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.1,941 కోట్లుగా ఉంది. కాగా నివేదిక విశ్లేషించిన మొత్తం 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో 75 మంది(33 శాతం)తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్‌లలో ప్రకటించారు. వీరిలో 41 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులుండగా, ఇద్దరిపై హత్య( ఐపిసి సెక్షన్ 302)కు సంబంధించిన కేసులున్నాయి. నలుగురు సిట్టింగ్ ఎంపీలపై మహిళపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఈ నలుగురిలో ఒకరయిన రాజస్థాన్‌నుంచి ఎన్నికయిన కాంగ్రెస్‌కు చెందిన కెసి వేణుగోపాల్‌పై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉంది. బిజెపికి చెందిన మొత్తం 85 మంది రాజ్యసభ ఎంపీల్లో 23 మంది(27 శాతం), కాంగ్రెస్‌కు చెందిన 30 మంది ఎంపీల్లో 12 మంది(40 శాతం),

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 13 మంది ఎంపీల్లో నలుగురు(31 శాతం),ఆర్‌జెడికి ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు(83 శాతం), సిపిఎంకు చెందిన ఐదుగరు ఎంపీల్లో నలుగురు(80 శాతం) ఆప్‌కు చెందిన 10 మంది ఎంపీల్లో ముగ్గురు(30 శాతం), వైఎస్‌ఆర్ సిపికి చెందిన తొమ్మిది మందిలో ముగ్గురు(33 శాతం), ఎన్‌సిపికి చెందిన ముగ్గరు ఎంపీల్లో ఇద్దరు(67 శాతం)తమపై క్రిమినల్ కేసులున్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News