Monday, January 20, 2025

గూగుల్‌లో 12 వేల ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ ఐటి సంస్థ గూగుల్ కూడా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ శుక్రవారం ఇమెయిల్ ద్వారా సిబ్బందికి సందేశాలను పంపారు. ఈ నిర్ణయానికి పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని, కొందరు ప్రతిభావంతులైన ఉద్యోగులకు క్షమాపణ చెబుతున్నాను అని ఆయన అన్నారు. ‘నేను కొంత కఠినమైన వార్తలను మీతో పంచుకుంటున్నాను. సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నాం.

అమెరికాలో ప్రభావితమయ్యే ఉద్యోగులకు మేము వేరుగా ఇమెయిల్‌ను పంపాం. ఇతర దేశాల్లో అక్కడి చట్టాల వల్ల ఈ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటుంది’ అని పిచాయ్ ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ఆల్ఫాబెట్ 12000 మందిని తొలగించనుందని, ఇది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం శాతం ఉంటుందని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కూడా 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెక్నాలజీ రంగంలోని కంపెనీలు ఉద్యోగుల తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితులే కారణం

గూగుల్ తొలగింపులు కార్పొరేట్ ఫంక్షన్‌తో పాటు ఇంజనీరింగ్, ఉత్పత్తుల బృందంతో పాటు అన్ని టీమ్‌లను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపు జరుగుతోందని, దీని ప్రభావం అమెరికాలో వెంటనే కనిపిస్తుందని గూగుల్ తెలిపింది. గూగుల్‌లో తొలగింపులకు ఆర్థిక అనిశ్చితే కారణమని కంపెనీ తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలిచే సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెడుతున్నాయి. ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ నోట్‌లో ‘మా మిషన్ బలం, మా ఉత్పత్తులు, సేవలు, కృత్రిమ మేధస్సులో ప్రారంభ పెట్టుబడుల ద్వారా ముందున్న అపారమైన అవకాశాలపై నమ్మకం ఉంది’ అని అన్నారు.

ఆర్థిక మాంద్యంతోనే లేఆఫ్‌లు

ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పెద్ద టెక్ కంపెనీలు తొలగింపుల దశను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగానే ఉద్యోగాల్లో సంక్షోభం నెలకొంది. దిగజారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్టా అమెరికాకు చెందిన అమెజాన్, మెటా వంటి టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే తొలగింపులు చేపట్టాయి. ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఐటి కంపెనీలకు పెద్ద అవకాశం లభించింది. ఈ సమయంలో కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మామూలుగా మారిందని, ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లడం మొదలుపెట్టారని, నష్టాలను తగ్గించుకునేందుకు ఇప్పుడు కంపెనీలు కోతలు ప్రారంభించాయి.

కోర్టు తీర్పును సమీక్షిస్తున్న గూగుల్

సుప్రీం కోర్టు తీర్పుతో గూగుల్ ఆలోచనలు మారుతున్నట్లు కనిపిస్తోంది. గూగుల్‌కి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కి సహకరించాలని గూగుల్ తెలిపింది. గూగుల్‌పై సిసిఐ జరిమానా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మీడియా నివేదికల ప్రకారం, సిసిఐ ఆర్డర్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో నిర్ణయాన్ని సమీక్షిస్తున్నట్లు, కమిషన్‌కు సహకరిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. సుప్రీంకోర్టు గురువారం నాటి నిర్ణయాన్ని కంపెనీ సమీక్షిస్తోందని గూగుల్ ప్రతినిధి తెలిపారు. 10 శాతం జరిమానాను గూగుల్ జమ చేయాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ( ఎన్‌సిఎల్‌ఎటి) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గూగుల్‌కు సంబంధించిన రూ.1,337 కోట్ల జరిమానాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఎన్‌సిఎల్‌ఎటి ఉత్తర్వును పాటించేందుకు సుప్రీంకోర్టు గూగుల్ ఇండియాకు ఒక వారం అంటే 7 రోజులు గడువు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News