Wednesday, January 22, 2025

పోలవరం ‘జల ప్రళయం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నట్లే జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మూలంగా తెలంగాణలోని భద్రాచలం పట్టణమే కాకుండా ఏకం గా 120 కిలోమీటర్ల పొడవునా ముంపు సమస్య ఉంటుందని ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖాధికారులు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ప్రాథమికంగానే తెలంగాణలో 120 కిలోమీటర్ల మేర ముంపు సమస్య ఉంటుందని అంచనాకు రావడంతో ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ బ్యాక్ వాట ర్ సమస్య, మునిగిపోతున్న తెలంగాణ పల్లెలు, పట్టణాల సంఖ్యను తలుచుకుంటుంటేనే గుండె ఆగినంత పనవుతోందని తెలంగాణ నీటి ల శాఖలోని సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ 120 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఉందంటే భద్రాలచం నుంచి దుమ్ముగూడెం, ములుగు వరకూ బ్యాక్‌వాటర్ సమస్య ఉంటుందని అంచనా వేశారు.

ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఎన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారో, జిల్లాలకు జిల్లాలే నీటిలో మునిగిన ఇటీవల వరదలే నిరూపించాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన స్పిల్‌వేతో పాటుగా రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కూడా పూర్తయితే బ్యాక్‌వాటర్ సమస్య నేడున్నదాని కంటే మరింత ఎక్కువగా ఉంటుందని ఆ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే నదికి ఇరువైపులా అత్యంత బలమైన, ఎత్తయిన కరకట్టలను నిర్మించుకొంటేనే ముంపు సమస్యలను కొంతమేరకైనా తగ్గించుకోవచ్చునని అంటున్నారు. అంతేగాక భద్రాచలం పట్టణం నుంచి ఒక డ్రైన్ వచ్చి గోదావరి నదిలో కలుస్తుందని, వరదలు వచ్చినప్పుడు నదిలోని నీరంతా ఆ డ్రైన్ నుంచి భద్రాచలం పట్టణంలోనికి వెనక్కు వెళుతోందని, దాంతో పట్టణం ముంపునకు గురవుతోందని, అత్యంత కీలకమైన ఈ సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారులు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అధికారులు కోరారు.

అంతేగాక భద్రాచలం పట్టణం మాదిరిగానే ఇంకా అనేక గ్రామాలు పట్టణాల నుంచి కూడా అనేక డ్రైనేజీలు గోదావరి నదిలో కలిసే విధంగా టౌన్ ప్లానింగ్‌లు జరిగాయని, వాటి నుంచి వరద నీరు వెనక్కు వెళ్లి పట్టణాలు, గ్రామాలను ముంచెత్తుతున్నాయని, వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు. అందుకోసం షట్టర్లు, లాకులను నిర్మించాలని కోరుతున్నారు. డ్రైనేజీలు నదిలోనికి కలిసేటప్పుడు షట్టర్ తెరుచుకోవాలని, అదే క్రమంలో వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాటంతట అవే షట్టర్‌లు మూసుకుపోయే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి డ్రైనేజీపై షట్టర్లను నిర్మించాలని ఆ అధికారులు కోరుతున్నారు. కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులతో ఏర్పడిన ప్రత్యేక బృందం గోదావరి నది వెంట పర్యటించి ఉమ్మడి సర్వే నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన గోదావరి నది వెంట 120 కిలోమీటర్ల వరకూ ముంపు ప్రమాదం ఉందని ప్రాథమిక అధ్యయనంలో తేల్చారు.

కిన్నెరసాని నదిలో నీటి ప్రవాహం గోదావరి నదిలోకి సాఫీగా సాగే అవకాశాలు మూసుకుపోతాయని తేల్చింది. గోదావరినదిలో వరద ఉధృతి కిన్నెరసానితో పాటు ముర్రేడు, పెదవాగు వరదనీటిని కూడా అడ్డుకుని గోదావరిలో ఈ నదుల నీరు కలవనీయకుండా ఎగదన్నే ప్రమాదం అధికంగా ఉంటుందన్న అంచనాకు వచ్చింది. కిన్నెరసాని, ముర్రేడుతోపాటు సుమారు 30కిపైగా వాగులు వంకల వరద నీరు పోటేస్తుందని , దీనివల్ల ఈ వాగులు వంకలకు ఇరువైపులా పంట పొలాలు నీటి మునిగి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయానికి వచ్చింది. కేంద్రజల సంఘం గైడ్‌లైన్స్ మేరకు గోదావరికి ఇరువైపులా ముంపు ఎంత అన్నది తెలుగురాష్ట్రాల ఉమ్మడి సర్వేబృందం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది. భధ్రాచలం, బూర్గం పాడు, దుమ్ముగూడెం , అశ్వాపురం , మండలాల్లో పర్యటించింది. పోలవరం ప్రాజెక్టులో గరిష్టస్థాయి 46 మీటర్ల నీటిమట్టం ఉంటే ప్రాజెక్టు నుంచి వెనుకకు ఎగదన్నే నీటి ప్రభావం ఎంత మేరకు విస్తరిస్తుందన్నది అధికారల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నదిలో నీటిమట్టం 150 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నదిలో మొదటి ప్రమాద స్థాయిలో నీటి మట్టం 43 అడుగులకు ఉంటుందని అంచనా వేశారు. దీని అధారంగానే వరదల సమయంలో ముంపు సమస్య తీవ్రత ఏమేరకు పెరుగుతుందన్నది సాంకేతికంగా పరిశీలన జరిపారు. భద్రాచలం పట్టణం వరదనీటిలో మునగకుండా ఏవిధంగా రక్షణ కల్పించాలన్నది కూడా పరిశీలన చేశారు. గోదావరి నదికి ఇరువైపులా రక్షణగోడలు ఏవిధంగా నిర్మించాలి, మట్టితో కట్టలు నిర్మిస్తే వాటి భద్రత ఎంత అన్నది అంచనా వేశారు. మట్టికట్టలు కాకుండా రాతికట్టడాలు నిర్మించాలా, ఎంత పొడవున నిర్మిచాల్సిన అవసరం ఉంది, ఎంత ఎత్తులో రక్షణ గోడలు నిర్మించాలి అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

ఏపిలో కూడా ఏటపాక మండలం కన్నాయిగూడెం , తెలంగాణలోని భధ్రాద్రిజిల్లా దుమ్ముగూడెం మండలం తురుబాక గ్రామాల మధ్యలో ఉన్న వాగు ప్రవాహ ఉధృతి ఎంత మేరకు ఉంటుందన్నది కూడా అంచనా వేశారు. గోదావరి నది క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉన్న మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలు, గోదావరి నదికి వచ్చిన వరదలు, భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చరికల స్థాయిని దాటిపోయిన నీటిమట్టాలు, నదికి ఇరువైపులా మునిగినా గ్రామాలు ,ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించిన గ్రామాలు తదితర వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సమస్యలపై ఈ బృందం ప్రాధమికంగా ఒక అంచనాకు రాగలిగింది. ఒక సారి సర్వేతోనే తుది నిర్ణయానికి రాలేమని అధికారులు వెల్లడించారు. త్వరలోనే మరోమారు సర్వే జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. సర్వే బృందంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీ నాగేంద్రకుమార్, సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఏపి నీటిపారుదల శాఖ నుంచి ఈఈ రమణ, డిఈఈ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News