Monday, December 23, 2024

చైనా, పాక్ టార్గెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత సైన్యం అత్యంత శక్తివంతమైన దాదాపు 120 ఖండాంతర ప్రళయ్ క్షిపణులను సమీకరించుకొంటోంది. వీటిని చైనా సరిహద్దులో మొహరించేందుకు భారతదేశం రంగం సిద్ధం చేసుకుంది. రక్షణ శాఖ, సైనిక వర్గాల నుంచి ఇటువంటి ప్రళయ్ క్షిపణుల అవసరం ఉందని తెలియచేయడంతో సంబంధిత ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు అనుమతిని వెలువరించాయి. ఈ అరివీర భయంకర క్షిపణులను ప్రత్యేకించి ఎక్కువగా చైనా సరిహద్దులలో సిద్ధంగా ఉంచుతారు. కొన్నింటిని పాకిస్థాన్ సరిహద్దులో సన్నద్ధం చేస్తారు.

అత్యంత కీలకమైన వ్యూహాత్మక పరిస్థితుల్లో బాలిస్టిక్ మిస్సైల్స్‌ను రంగంలోకి దింపాలని భారతదేశం విధాన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏకకాలంలో ఇన్ని క్షిపణులను సమీకరించుకునేందుకు నిర్ణయం తీసుకుందని రక్షణ వర్గాల సమాచారం మేరకు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పటికే చైనా, పాకిస్థాన్‌ల వద్ద బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. దీనికి ప్రతిగా భారత్ వీటిని సమీకరించుకుంటుంది. తొలుత ఈ ప్రళయ్ క్షిపణులను భారతీయ వాయు సేనలోకి ఆ తరువాత సైన్యంలోకి ప్రవేశపెడుతారు.

ఈ క్షిపణుల ప్రత్యేకతలు 500 కిమీల లక్షాల ఛేదన

ప్రళయ్ బాలిస్టిక్, ఉపరితల నుంచి ఉపరితల క్షిపణుల నుంచి 150 కిలోమీటర్ల నుంచి 500 కిమీల లక్షాలను ఛేదించగలవు. అవసరం అయితే దీని పరిమితిని పెంచవచ్చు . ఈ క్షిపణుల ద్వారా 350 నుంచి 700 కిలోల హైగ్రేడ్ పేలుడుపదార్థాలను తీసుకువెళ్లవచ్చు. శత్రు లక్షాన్ని సమూలంగా ఛేదించవచ్చు. చొచ్చుకుపోవడం, ఛేదించడం పేల్చడం వంటి పలు పరిణామాలను అవలీలగా చేపడుతుంది. మార్గమధ్యంలో ఎదురయ్యే టార్గెట్‌లను కూడా దెబ్బతీస్తుంది. రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థను , మార్గమధ్యంలోని కమాండ్, కంట్రోలు సెంటర్లు కూడా వీటి ధాటికి దెబ్బతింటాయి. నేలపై రాదార్లపై కూడా ఇవి సంచరించగలవు. అవసరం అనుకున్న చోటికి వీటిని తీసుకుపోవచ్చు. దాడికి దిగే క్షిపణులను ఇవి నాశనం చేస్తాయి. అవసరం అనుకున్నప్పుడు మార్గం మార్చుకునే శక్తితో ఉంటాయి. 2015 నుంచి రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) వీటిని పలు విధాలుగా పరీక్షిస్తూ రూపొందిస్తోంది. ఈ నెలలోనే 21, 22 తేదీలలో వీటి సామర్థం పరీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News