Tuesday, November 5, 2024

రాష్ట్రంలో 1200 ఎంబిబిఎస్ సీట్లు

- Advertisement -
- Advertisement -

అందుబాటులోకి ఎనిమిది ప్రభుత్వ
మెడికల్ కాలేజీలు వైద్యరంగంలో
ఇది చరిత్రాత్మక విజయం 70
ఏళ్ల సమైక్య పాలనలో మూడు
మెడికల్ కాలేజీలు వస్తే.. ఏడేళ్లలో
17కు పెంచాం రెండు,
మూడేళ్లలో జిల్లాకో మెడికల్ కాలేజ్
కేంద్రం రాష్ట్రానికి మెడికల్ కాలేజ్
ఇస్తే ఎక్కడ ఇచ్చిందో కిషన్ రెడ్డి
చెప్పాలి : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,200 ఎంబిబిస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు వెల్లడించారు. ఒక విద్యాసంవత్సరం లో 1200 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రా వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని పేర్కొన్నారు. 70 ఏళ్ల సమైక్య పాలనలో మూడు మెడిక ల్ కాలేజీలు వస్తే, ఏడేళ్లలో 17 కాలేజీలు తెచ్చుకున్నామని చెప్పారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, డిఎంఇ రమేష్‌రెడ్డి, కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డితో కలిసి సోమవారం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తాను ఉద్యమ నాయకుడిగా మెడికల్ కాలేజీల విషయం లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడానని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ వస్తేనే మెడికల్ కాలేజీలు వస్తాయని, న్యాయం జరుగుతుందని మాట్లాడినని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్‌లో మూడే మూ డు మెడికల్ కాలేజీలు రాగా, ఈ ఏడేళ్లలో కొత్తగా 12 కాలేజీలను తెచ్చుకోగలిగామని వివరించారు.

ఈ కాలేజీల్లో 650 పడకలు, 30 రకాల స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. కొత్త మెడికల్ కాలేజీలతో మెడికల్ కాలేజీలతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణపై చూపిన వివక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరగలేదని అన్నారు. ఒక్క మెడికల్ కాలేజీకి రూ. 510 కోట్ల చొప్పున సిఎం కెసిఆర్ మొత్తం రూ. 4,080 కోట్లు మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. వైద్యవిద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన నిధులు, వనరులు సమకూరుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చేందుకు కృషి చేసిన డిఎంఇని, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను, అధికారులు విమలా థామస్, డాక్టర్ వాణిలను, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ కృషి ని మంత్రి అభినందించారు.

3.3 రెట్లు పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు

రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబిబిఎస్ సీట్లు ఉంటే, ఈ విద్యాసంవత్సరంలో 2,902కు సీట్లను పెంచుకున్నామని హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబిబిఎస్ సీట్లు 3.3 రెట్లు పెరిగాయని అన్నారు. ఇది చారిత్రాత్మక విజయం అని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్, చైనా, ఫిలిఫ్పీన్ వంటి దేశాలకు వెళ్లి వైద్యవిద్యను అభ్యసించవలసిన అవసరం ఉండదని, ఇక్కడే వారు వైద్యవిద్యను అభ్యసించవచ్చని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ- ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 6,540 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2014లో ప్రభుత్వ- ప్రైవేట్ రంగంలో 2,600 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా,12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రైవేట్ కాలేజీల కంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలే పెరిగాయని చెప్పారు. ఇవి కాకుండా ఆయుష్ కింద ఆయుర్వేద,హోమియో, యునాని విభాగాల్లోనూ మెడికల్ సీట్లు ఉన్నాయని తెలిపారు. ఎంబిబిఎస్ సీట్లతో పాటు పిజి సీట్లు పెరిగాయని అన్నారు. 2014లో ప్రభుత్వం పిజి మెడికల్ సీట్లు 613 ఉంటే ప్రస్తుతం 1,249కి పెరిగాయని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో 192 పిజి సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 2,449 పిజి సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రెండు మూడు రోజుల్లో మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.

కేంద్రం మొండిచెయ్యి చూపినా

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బిజెపి నాయకులు ఇక్కడి వచ్చి ఏవేవో మాట్లాడుతుంటారని అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించలేదని బిజెపి నాయకులు అంటే గతంలో కేంద్రానికి రాసిన లేఖలు భయపెట్టామని అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి మంజూరు చేయకుండా, తామే ఇచ్చామని కిషన్‌రెడ్డి మాట్లాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్రం మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వకపోయిన, సొంత డబ్బులతోనే జిల్లాకో కాలేజీ పెట్టాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్, పట్టుదల వల్లనే తెలంగాణలో మెడికల్ సీట్లు, మెడికల్ కాలేజీలు పెరిగాయని స్పష్టం చేశారు. ఈ సారి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా, వచ్చే ఏడాది మరిన్ని కాలేజీలు వస్తాయని తెలిపారు. రెండు మూడేళ్లలో రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి సిఎం కెసిఆర్ వైద్యారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

భువనగిరి ఆస్పత్రిలో ఎయిమ్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్

తెలంగాణలో పేరుకే ఎయిమ్స్ ఇచ్చారు.. అక్కడ ఆపరేషన్ థియేటర్ లేదు.. ఆక్సిజన్, బ్లడ్ బ్యాంక్ ఏదీ లేదని చెప్పారు. ఎయిమ్స్ వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారు భువనగిరి ఆస్పత్రిలో ప్రాక్టికల్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కేంద్ర మంత్రి తన స్థాయి దిగజార్చుకోని సిల్లీగా మాట్లాడుతున్నరని మండిపడ్డారు. కేంద్రం మెడికల్ కాలేజీ ఇస్తే ఎక్కడ ఇచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలని అడిగారు. అందుకు సంబంధించిన కాగితాలు చూపించాలని సవాల్ విసిరారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం దిక్కుమాలిన రాజకీయం అని… ఈ విషయాన్ని కిషన్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. డాక్టర్ అయిన గవర్నర్ ట్వీట్ సరికాదని అన్నారు. గవర్నర్‌కు వివరాలు పంపిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా…ఇస్తే అది చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

బీ కేటగిరి సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో బీ కేటగిరి సీట్లలోనూ 85 శాతం లోకల్ రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీని వల్ల తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలోనే వైద్యవిద్యను చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఇదివరకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు బి కేటగిరీలో తెలంగాణలో వైద్యవిద్యను చదువుకున్నారని, ప్రభుత్వ నిర్ణయం వల్ల 1,067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని పేర్కొన్నారు. మరో 15 శాతం ఓపెన్ కోటా ఉంటుందని, అందులో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పాటు తెలంగాణ విద్యార్థులకు కూడా సీట్లు లభిస్తాయని చెప్పారు.

అందుబాటులోకి 1,680 బిఎస్‌సి నర్సింగ్ సీట్లు

రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీతోపాటు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ నర్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2014లో 4 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 9కి పెరిగాయని చెప్పారు. ఈసారి మొత్తం 19 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2014లో బిఎస్‌సి నర్సింగ్ సీట్లు 240 ఉంటే, ఇప్పుడు 1,680కి పెరిగాయని తెలిపారు. కొత్తగా 1,440 సీట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం స్టైఫండ్‌ను పెంచిందని అన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.5 వేలు, రెండో ఏడాది విద్యార్థులకు రూ.6 వేలు, మూడో ఏడాది విద్యార్థులకు రూ.7 వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.8 వేలు స్టైఫండ్‌ను పెంచామని తెలిపారు.

ఆర్‌ఎంపీల విషయంలో నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు

రాష్ట్రంలో గుర్తింపు లేని హాస్పిటళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 33 జిల్లాలో స్పెషల్ టీమ్స్‌లతో దాడులు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,058 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించగా, 103 ఆస్పత్రులను సీజ్ చేశామని చెప్పారు. 633 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని, 75 హాస్పిటళ్లకు జరిమానా విధించామని అన్నారు. ఆర్‌ఎంపిల విషయంలో తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అనర్హులు వైద్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News