Monday, January 20, 2025

గ్రూప్-1 మెయిన్స్‌కు 123 మంది గిరిజన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 123 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్‌టి స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ పొంది మెయిన్స్‌కు ఎంపికైన గిరిజన విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం సంక్షేమభవన్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విద్యార్థులకు ట్యాబ్‌లు, ప్రతి నెల రూ.5 వేలు స్లయిఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో గిరిజన విద్యార్థులు మెయిన్స్‌కు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. గ్రూప్1 మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఈ విద్యార్థులకు రెసిడెన్షియల్ సౌకర్యంతో పాటు మెరుగైన కోచింగ్ అందజేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేస్తూ విద్య విషయంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.

దానిలో భాగంగానే ప్రాథమిక విద్య మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజితో పాటు వృత్తివిద్యా కోర్సులను పెద్ద ఎత్తున అభివృద్ధి పరుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే మన విద్యార్థులు తమ ప్రతిభను, విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతున్నారంటే ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టికి నిదర్శనమని అన్నారు. మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉద్యోగవకాశాలు పొందాలని మంత్రిగా గాకుండా ఒక తల్లిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ నుండి అన్ని రకాలుగా సౌకర్యాలను అందజేస్తామని, ప్రైవేట్ సెక్టార్ కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలను అందిస్తుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిసిసి జిఎం సీతారాం నాయక్, జెడి సబుజ్వల, స్టేట్ మిషన్ మేనేజర్ ట్రైకర్ లక్ష్మి ప్రసాద్, ఇందిరా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News