ఢిల్లీలో 7.72 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో ముందురోజు రెండు వేలకు పైగా నమోదైన కరోనా కొత్త కేసులు తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. సోమవారం 4 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 1247 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అలాగే దేశం మొత్తం మీద కలిపి ఒకేఒక్క కొవిడ్ మరణం ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది. ముందురోజు మృతుల సంఖ్య 214 గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలు మునుపటి లెక్కలను సవరించినప్పుడే మరణాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటివరకు 5.21 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలు (928) తక్కువగా ఉన్నాయి. దాంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 11,860 (౦.౦౩ శాతం)గా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. సోమవారం 16.89 లక్షల మంది టీకా తీసుకోగా, ఇప్పటివరకు 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
ఢిల్లీలో 7.72 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో వరుసగా రెండోరోజు 500 పైగా కేసులు వచ్చాయి. అయితే క్రితం రోజు కంటే కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. పాజిటివిటీ రేటు 7.72 శాతానికి పెరిగింది. కేసులు పెరుగుతున్నా, మరణాలు నమోదు కాకపోవడం ఊరటనిస్తోంది.