7 నెలల్లో ఇదే అత్యంత స్వల్పం
న్యూఢిల్లీ : దేశంలో గడచిన ఏడు నెలల్లో అత్యంత తక్కువగా మంగళవారం ఒక్కరోజు 12,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,04,79,179కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో మరో 167 మరణాలు సంభవించడంతో కొవిడ్ కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,51,327కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,11,294కి చేరుకోవడంతో రికవరీ రేటు 96.49 శాతానికి చేరుకుంది. మరణాల సంఖ్య మాత్రం 1.44 శాతంగా ఉన్నట్లు కేంద్రం వివరించింది. యాక్టివ్ కేసులు వరుసగా గత కొన్ని వారాల నుంచి 3 లక్షలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 2,16,558 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇది మొత్తం కేసుల సంఖ్య కేవలం 2.07 శాతం మాత్రమేనని పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 8,97,056 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో 18,26,52,867 నమూనాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ పేర్కొంది.