13 మంది అరెస్టు, ఘటనపై దర్యాప్తు
శ్రీనగర్ : స్థానిక జామిమా మసీదులో దేశ వ్యతిరేక నినాదాలకు దిగిన 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నమాజుల దశలో అక్కడ గుమికూడిన జనంలో కొందరు దేశ వ్యతిరేక నినాదాలకు దిగారని, విషయం తెలియగానే తాము అక్కడికి వెళ్లి అరెస్టులు చేశామని పోలీసులు తెలిపారు. 2021లోని బడే మసీదులో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. దీని తరువాత ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. సుదీర్ఘ మూత తరువాత ఇటీవలే జామిమా మసీదులో ప్రార్థనలకు అధికారులు అనుమతిని ఇచ్చారు.
ఈ దశలోనే శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నమాజులకు దాదాపు 24వేల మంది జనం హాజరయ్యి, ప్రార్థనలు నిర్వహించారు. అయితే వీరిలో అతి కొద్ది మంది అవాంఛనీయ రీతిలో దేశ వ్యతిరేక నినాదాలకు దిగినట్లు స్థానిక ఎస్‌ఎస్‌పి రాకేష్ బల్వాల్ తెలిపారు. . కావాలనే శాంతి సామరస్యాలను దెబ్బతీసేందుకు దుండగులు కొందరు మసీదులో చొరబడి ఆగడానికి పాల్పడ్డారని, వీరికి పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి ఆదేశాలు అంది ఉంటాయని అధికారులు తెలిపారు. శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి బల్వాల్ వివరించారు.