Thursday, January 23, 2025

13 మందిని బలిగొన్న ఆ బస్సు యజమాని బిజెపి నేత

- Advertisement -
- Advertisement -

గుణ: మధ్యప్రదేశ్‌లోని గుణలో బుధవారం రాత్రి డంపర్ లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మరోడజను మందికి పైగా గాయపడ్డారు. బుధవారం ఘటనా స్థలంలో 12 మంది మృతదేహాలను కనుగొనగా, గురువారం మరో మృతదేహం లభ్యమయింది. ఆ మృతదేహం డంపర్ డ్రైవర్‌ది కావచ్చని భావిస్తున్నట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దినేశ్ సన్‌వ్లే చెప్పారు. అయితే బస్సు యజమానిని బిజెపి నేత ధర్మేంద్ర సికార్వార్‌గా గుర్తించారు. అలాగే బస్సుకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల గడువు ముగిసినట్లు కూడా గుర్తించారు. అంతేకాదు ఆ మార్గంలో నడిచేందుకు ఆ బస్సుకు పర్మిట్ కూడా లేదని అధికారులు అంటున్నారు. అలాగే 2021నుంచి రోడ్డు టాక్స్ కూడా చెల్లించని విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో గుణఆరోన్ రోడ్డులో డంపర్ లారీని ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు ఆరోన్ వెళ్తుండగా, డంపర్ గుణకు పోతోంది. నలుగురు ప్రయాణికులు ప్రమాదంనుంచి తప్పించుకుని బస్సులోంచి బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విధుల్లో నిర్లక్షం వహించినందుకు గుణా రీజిజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారి( ఆర్‌టిఓ) రవి బరేలియాను. చీఫ్ మెడికల్ ఆఫీసర్ విడి కట్రోలియాను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి గుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాన్ని హృదయవిదారక ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఘటనపై దర్యాప్తుకు అదనపు జిల్లా క్లక్టర్ ముకేశ్ కుమార్ శర్మ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల్లో నివేదిక అందజేయాల్సిందిగా కమిటీని ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు.

కాగా సస్పెండ్ కావడానికి ముందు బరేలియా విలేఖరులతో మాట్లాడుతూ బస్సుకు ఈ రూట్‌లో నడిచేందుకు తగిన సర్టిఫికెట్ కానీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కానీ లేవని చెప్పారు. బస్సు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సిందిగా బస్సు యజమాని రెండు నెలల క్రితం ఆర్‌టిఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాడని, అయితే టాక్స్ చెల్లించనందున అది పెండింగ్‌లో ఉందని ఆయన చెప్పారు. ఆ రూట్‌లో నడిచేందుకు పర్మిట్ లేనందున కొంత కాలంగా బస్సును వాడడం లేదని, అయితే మరో ప్రయాణికుల వాహనం స్థానంలో బుధవారం దాన్ని వాడి ఉండవచ్చని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News