పిడుగుపాటుకు 13మంది మృతి చెందిన విషాద సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పిడుగుపాటుకు పదమూడు మంది మరణించారని బుధవారం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈక్రమంలో పిడుగులు పడటంతో వేర్వేరు జిల్లాలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) ప్రకారం.. బెగుసరాయ్‌లో ఐదుగురు, దర్భంగాలో నలుగురు, మధుబనిలో ముగ్గురు, సమస్తిపూర్‌లో ఒకరు మరణించారు. 13 మంది మృతికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సమర్పించిన బీహార్ ఆర్థిక సర్వే (2024-25) నివేదిక ప్రకారం, 2023 సంవత్సరంలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాల కారణంగా రాష్ట్రంలో 275 మరణాలు నమోదయ్యాయి.