శాంటియాగో: లాటిన్ అమెరికాలోని చిలీ అడవులను కార్చిచ్చు దహనం చేస్తోంది. అక్కడ వేలాది ఎకరాల్లో అడవులను మంటలు బూడిద చేస్తున్నాయి. మంటల్లో ఇప్పటివరకు 13 మంది సజీవదహనమయ్యారు. కాగా దేశవ్యాప్తంగా 190కి పైగా ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయని, 14 వేల హెక్టార్లకు పైగా అడవులు మంటల్లో దహించుకుపోయాయని వారు తెలిపారు. కార్చిచ్చులో చిలీ రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలోని బయోబియా శాంటా జువానా పట్టణంలో 13 మంది మరణించారని అధికారులు తెలిపారు.
భారీ గాలులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని చిలీ ప్రభుత్వం ప్రకటించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఓ హెలికాప్టర్ కూలి పైలెట్ మృతి చెందినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 190కి పైగా ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా, 45 ప్రాంతాల్లో మాత్రమే అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పుతున్నాయని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బొరిక్ ప్రకటించారు. బ్రెజిల్, అర్జెంటీనా దేశాల సహాయంతో 63 విమానాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వందలాది ఇళ్లు మంటల్లో బూడిదయినట్లు హోంమంత్రి కరోలినా తోహా వెల్లడించారు.
రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కార్చిచ్చు కారణంగా వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశముందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది.