Monday, December 23, 2024

కొండచరియలు పడి 13 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో భారీవర్షాలకు కొండ చరియలు, మట్టిపెళ్లలు విరిగిపడటంతో 13 మంది దుర్మరణం చెందారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖాలాపూర్ తాలూకా ఇర్షాల్‌వాడి గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం విలేకరులకు తెలిపారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో కుండపోత వానలు పడుతున్నాయి. దీనితో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మట్టిపెళ్లలు విరిగిపడటంతో పలువురు మృతి చెందారు. 48 కుటుంబాలు నివసించే ఈ గ్రామం అంతా పూర్తిగా దెబ్బతింది. శిథిలాల కింద చిక్కుపడ్డ వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి షిండే గురువారం వచ్చారు. పరిస్థితి గురించి తెలుసుకున్నారు. భారీ వర్షాలు పడుతూనే ఉండటంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. ఇప్పటివరకూ రెస్కూ బృందాలు 13 మృతదేహాలను వెలికితీసినట్లు సిఎం తెలిపారు. 75 మందిని సురక్షితంగా బయటకు తీశారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈ గ్రామంలో కొందరు వరి పొలాల పనులకు వెళ్లడం, చాలా మంది పిల్లలు సమీపంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లిన దశలో మొత్తం గ్రామస్తుల పరిస్థితి గురించి ఆరాతీస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక, పునరావాస చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలతో విరిగి పడ్డ మట్టిపెళ్లలు , చెత్తాచెదారం, దాదాపు 20 అడుగుల వరకూ పేరుకుపోయి ఉంది. సహాయక బృందాలు భారీ వర్షాల కారణంగా వెనువెంటనే ఈ ప్రాంతంలోకి యంత్రాలను తరలించలేకపోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ఇక్కడికి రెండు హెలికాప్టర్లను కూడా పంపించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మారాయి. చుట్టూ వరద, వీడని వర్షాలతో ఈ ప్రాంతం అంతా దెబ్బతిని ఉంది. జనం ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వీరు నివసించేందుకు తాత్కాలికంగా 60 కంటైనర్లను ఏర్పాటు చేసినట్లు సిఎం వివరించారు.

అంతకు ముందు ఇక్కడి పరిస్థితి గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ఆందోళన వ్యక్తం చేశారు. 48 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని తెలిపారు. ఈ గ్రామం నవీ ముంబైకి మంచినీరు సరఫరా చేసే మోర్బే డ్యామ్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలోనే ఓ పెద్ద పురాతన కోట కూడా ఉంది. గిరిజనులు నివసించే ఈ గ్రామాన్ని చేరుకోవడానికి ఇప్పటికీ సరైన ఫక్కా రోడ్డు లేదు. ముంబై పుణే హైవే పై ఉండే ఛౌక్ ఈ ఊరికి సమీపంలో ఉండే పట్టణం. గిరిజనులు ఇక్కడికి అడ్డదారుల మీదుగా సరుకుల కోసం వెళ్లుతుంటారు. 2014 జులై 30న మహారాష్ట్రలోని పుణే జిల్లా మలిన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 153 మంది చనిపొయ్యారు. అప్పట్లో జరిగిన విఘాతంతో పాత గ్రామం అంతా నామరూపాలు లేకుండా పోయింది. ఓ స్కూల్ భవనం ఒక్కటే మిగిలి ఉంది. ఈ ఘటన తరువాత ఇప్పుడు ఇర్షాల్‌వాడి గ్రామంలో భారీ స్థాయి దుర్ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News