Monday, December 16, 2024

ఎపిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13మంది మృతి

- Advertisement -
- Advertisement -

13 people died in different road accidents in AP

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 13మంది మృత్యువాత పడ్డారు. ఈక్రమంలో ఓ కేసు నిమిత్తం చిత్తూరు జిల్లాకు విచారణకు వెళుతున్న కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గంజాయి స్మగ్లర్ల ను పట్టుకునేందుకు బెంగళూరు నుంచి కర్నాటక పోలీసులు ప్రయాణిస్తున్న కారుకు తిరుపతి జాతీయ రహదారి, పూతలపట్టు మండలం, చౌటపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని పక్కరోడ్డులోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్నాటక పోలీసులు మృతి చెందారు. ఎస్‌ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎస్‌ఐ దీక్షిత్, కానిస్టేబుళ్లు శరవణ, బసవకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అదేవిధంగా కర్నూలు సమీపంలోని వెల్దుర్తి జాతీయ రహదారిపై కర్నూలు నుంచి డోన్ వైపు వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతులు బేతంచర్ల మండలం మర్రికుంట గ్రామానికి చెందిన తిమ్మమ్మ (62) అయ్యస్వామి(40) కాగా.. మరొకరిని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు కప్పట్రాళ్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే కమ్మపల్లి క్రాస్ రోడ్డు వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ప్రొద్దుటూరు కృష్ణారెడ్డి, పెంచలమ్మకు సాయి (8) అనే కుమార్తె, కుమారుడు (3 నెలలు) ఉన్నారు. పెంచలమ్మ తన కుమార్తె, కుమారుడిని తీసుకుని ఆటోలో ఓబులవారిపల్లెలోని పుట్టింటికి కుమారుడి అన్నప్రాశన కోసం వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు పెంచలమ్మ, ఆమె, పిల్లలతోపాటు తల్లి ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ, పొరుగింట్లో ఉండే వెంకట తులసమ్మ ఆటోలో రైల్వేకోడూరు బయల్దేరారు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెంచలమ్మ కుమార్తె సాయి, కుమారుడు, తల్లి వెంకటసుబ్బమ్మ (55), వెంకట తులసమ్మ (34) అక్కడికక్కడే మరణించారు. ఆటోడ్రైవరు బాలకృష్ణ (34), పెంచలమ్మకు (30) తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెంచలమ్మ మృతి చెందారు.ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News