Monday, December 23, 2024

పండుగ పూట తీవ్ర విషాదం: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి సందర్భంగా గురువారం జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. దీనితో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. ఇండోర్ నగరంలో బాలేశ్వర్ మహాదేవ్ ఝేలేలాల్ దేవాలయంలోని మెట్ల బావి వద్ద జరిగిన దుర్ఘటన పలువురి మృతికి దారితీసింది. పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ప్రాంగణంలో తరాల నుంచి శ్రీరామ నవమి ఆచారం ప్రకారం మెట్లబావి వద్ద అగ్నిక్రతువు హోమం జరుగుతుంది. దీనిని తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ దశలోనే పలువురు బావి పై కప్పుపై కూడా కూర్చున్నారు.

అయితే ఈ బరువు తట్టుకోలేక ఈ గోడ కూలడంతో కింద మెట్లపై ఉన్న పలువురు బావిలో పడటం , గందరగోళం నెలకొన్న దశలో ప్రాణాలు విడిచారు. తొలుత ఇక్కడ పాతిక మంది వరకూ మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. దాదాపు 30 నుంచి 35 మంది వరకూ భక్తులు బావిలో పడ్డట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 19 మందిని రక్షించినట్లు ఇండోర్ పోలీసు కమిషనర్ మార్కండ్ దియోస్కర్ విలేకరులకు చెప్పారు. ఘటనలో అక్కడికక్కడే ఎనమండుగురు మృతి చెందినట్లు జిల్లా కలెక్టరు డాక్టర్ ఇళయరాజ టి తెలిపారు. దేవాలయంలోని మెట్లబావి వద్దకు రామనవమి వేడుక దశలో పెద్ద ఎత్తున జనం గుమికూడుతూ ఉంటారు. అయితే అత్యధికులు ఒక్కచోట చేరడంతోనే ప్రమాదం జరిగినట్లు వెల్లడైంది.

ఉన్నట్లుండి పలువురు బావిలో పడిపోవడంతో వారి బంధువులు, ఆత్మీయుల హాహాకారాలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. తమ వారి పరిస్థితి తెలుసుకునేందుకు జనం గుడి వెలుపల చుట్టుపక్కల గుమికూడారు. ఇప్పటికీ శిథిలాల కింద పలువురు చిక్కుపడి ఉన్నట్లు, వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు, ఉత్సవ కమిటీ కార్యకర్తలు, స్థానికులు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News