మరిపెడః ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి గంట వ్యవధిలోనే 13 మందిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన అధివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకట్ తండా, స్టేజి తండా గ్రామ పంచాయితీలలో చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం తొలుత మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజితండా గ్రామ పంచాయితీ పరిధిలోని మేగ్యాతండాలో ఓ పిచ్చికుక్కు తండ పురవీధుల్లో సంచరిస్తూ కంటికి కనబడ్డ వారందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గాయపడ్డ వారిలో గుగులోతు మోహన్, బోడ కీమా, భూక్య భద్రు, భూక్య కార్తీక్, భూక్య చరణ్‌లతో పాటు అక్కడి వెంచర్ వద్ద తల్లిదండ్రులతో ఉన్న తొమ్మిదేళ్ల బాలిక శ్వేతను పిచ్చికుక్క తీవ్రంగా గాయపర్చింది.
విషయం తెలుసుకుని తేరుకున్న తండావాసులు పిచ్చి కుక్కను వెంబడించారు. అక్కడి నుంచి వచ్చి పక్కనే ఉన్న మండలంలోని వెంకట్‌తండా గ్రామ పంచాయితీలోకి చొరబడింది. అక్కడ తారసపడ్డ గుగులోతు రాంలాల్, గుగులోతు విజయ, గుగులోతు బుల్లి, గుగులోతు ఈక్య, బానోతు హోలీ, బాలుడు సాయితేజ, మరో బాలుడిని ఇలా రెండు తండాల్లో స్వైర విహారం చేస్తూ గంట సమయంలోనే 13 మందిని పిచ్చికుక్క గాయపర్చింది. అనంతరం తండా ప్రజలంతా కలిసి పిచ్చికుక్కను హతమార్చారు. వెంకట్‌తండా సర్పంచ్ గుగులోతు సూర్యానాయక్ వెంటనే స్పందించి గాయపడిన వారిని మరిపెడ పిహెచ్‌సికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డవారిని అక్కడి నుంచి మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం చేసి 13 మందిని గాయపర్చిన సంఘటనతో ఆయా తండాల్లోని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, తండాలలో కుక్కల బెదడ ఎక్కువైదని వాటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.