పార్టీ పునర్‌వైభవానికి ఇదే చివరి అవకాశం
వెంటనే భేటీ కావాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సిద్ధూ లేఖ
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తేవడం కోసం తన 13 పాయింట్ల అజెండాపై చర్చించడానికి వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆ రాష్ట్ర పిసిసి చీఫ్ నవజోత్‌సింగ్‌సిద్ధూ లేఖ రాశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవల జరిగిన మార్పుల నేపథ్యంలో సిద్ధూ లేఖ ప్రాధాన్యత కలిగి ఉన్నది. కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం, సిద్ధూకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం తెలిసిందే. ఈ నెల 15న సిద్ధూ ఈ లేఖ రాశారు. అంతకు ఓరోజు ముందు ఢిల్లీలోని పార్టీ సీనియర్లతో ఆయన చర్చలు జరిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి పంజాబ్ నమూనా మేనిఫెస్టోను తన 13 పాయింట్ల అజెండాతో రూపొందించాలని సిద్ధూ ఈ లేఖలో సోనియాకు సూచించారు.
మరోవైపు 2017 ఎన్నికల్లో హామీ ఇచ్చిన 18 పాయింట్లను అమలు చేసే బాధ్యత నూతన ముఖమంత్రిపై ఉన్నదని అధిష్ఠానం చెబుతున్న విషయమూ తన దృష్టిలో ఉన్నదని సిద్ధూ ఆ లేఖలో గుర్తు చేశారు. ఆ హామీలతోపాటు తాను ప్రతిపాదిస్తున్న అజెండా కూడా ప్రాధాన్యమైనదని ఆయన స్పష్టం చేశారు. శిరోమణి అకాలీదళ్‌బిజెపి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 2015లో ఫరీద్‌కోట్ జిల్లాలోని కోట్కాపురా, బేహ్‌బల్‌కలాన్‌లలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటన విషయంలోనూ న్యాయం జరగాలన్నది పంజాబ్ ప్రజల డిమాండ్ అని తన లేఖలో తెలిపారు. సిక్కుల పవిత్ర గ్రంథం గుర్‌గ్రంథ్ సాహిబ్‌కు అవమానం జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆ సమయంలో అక్కడ ఆందోళనలు చెలరేగాయి. పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాకు సంబంధించి స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టిఎఫ్) నివేదికలో పెద్ద తల(పలుకుబడి ఉన్న నేత) గురించి ఉన్నదని, అతణ్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సిద్ధూ తన లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఎట్టిపరిస్థితిలోనూ పంజాబ్‌లో అమలు చేయబోమని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర క్యాబినెట్‌లో దళితులు, బిసిలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. కేవలం ముఖ్యమంత్రి స్థానంలో దళితుడిని కూర్చోబెట్టినంత మాత్రాన సరిపోదని, దోబా ప్రాంతానికి చెందిన మజ్బీ సిక్కుల(దళితుల) నుంచి కనీసం ఒకరిని, బిసిల నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. బాదల్స్ హయాంలో మాఫియారాజ్ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఇదే చివరి అవకాశమని సిద్ధూ తన లేఖలో పేర్కొన్నారు. బాదల్స్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొన్నదని, అవినీతి పెరిగిపోయి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన స్థాయికి దిగజారిందని లేఖలో తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల కోసం పంజాబ్ నమూనాలో తన 13 పాయింట్లతో మేనిఫెస్టో రూపొందించాలని సిద్ధూ తన లేఖలో స్పష్టం చేశారు. దీనిపై తన ఆలోచనలను వివరించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని సోనియాకు రాసిన లేఖలో కోరారు.