బీజింగ్: భారతదేశానికి చెందిన ప్రాచీన నాట్య కళా రూపమైన భరత నాట్యం చైనాలో తన ప్రాభవాన్ని చాటుకుంది. చైనా జాతీయురాలైన 13 ఏళ్ల బాలిక లీ ముజీ చైనాలో మొట్టమొదటిసారి భరత నాట్య అరంగేట్రాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించింది. ప్రముఖ భరత నాట్య కళాకారిణి లీలా శామ్సన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనాకు చెందిన నాట్యాభిమానుల సమక్షంలో ఆదివారం నాడిక్కడ లీ తన అఅరంగేట్రాన్ని ప్రదర్శించింది.
చైనాజాతీయురాలైన ఒక బాలిక పూర్తిగా స్వదేశంలోనే చైనా జాతీయురాలైన నాట్య గురువు చేత భరతనాట్యంలో శిక్షణ పొంది అరంగేట్రం ప్రదర్శించడం చైనా చరిత్రలో ఇదే మొదటిసారని భారతీయ ఎంబసీకి చెందిన సాంస్కృతిక విభాగం కార్యదర్శి టిఎస్ వివేకానంద్ తెలిపారు. తన వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందుతున్నచైనా విద్యార్థులలో అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యా ప్రదర్శనకు నాట్య గురువు జిన్ షాన్ షాన్ తెలిపారు.
లీ అరంగేట్రంఆనికి భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం లీలా శామన్సన్, ఆమె సంగీత కళాకారుల బృందం చెన్నై నుంచి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చారు. ఈ నెలాఖరులో లీ చెన్నైలో తన భరత నాట్య ప్రదర్శన ఇవ్వనున్నది.