Monday, December 23, 2024

గుండెపగిలిన గాయాలతో గాజా పట్టి

- Advertisement -
- Advertisement -

జెనీవా : గాజాస్ట్రిప్‌లో ఇప్పటికీ 1300కు పైగా భవనాలు ఇజ్రాయెల్ దాడులలో ధ్వంసం అయ్యాయి. తమ భూభాగంలోకి హమాస్ బలగాలు చొరబడి నరమేధం సాగించినందుకు ప్రతీకారంగా వారం రోజులుగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఆస్తి నష్టం వివరాలను ఐక్యరాజ్య సమితికి చెందిన ఒసిహెచ్‌ఎ శనివారం విడుదల చేసింది. 1300కు పైగా ఫక్కా భవనాలు ధ్వంసం అయ్యాయని, వీటిలోని 5540కు పైగా అపార్ట్‌మెంట్లు పనికిరాకుండా పోయ్యాయని తెలిపారు. కాగా 3750 వరకూ ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇవి ఉండటానికి వీల్లేకుండా శిథిలాలుగా మారాయి. కాగా ఇప్పటి దాడులు కేవలం ఆరంభం అని ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు ప్రకటించారు. హమాస్ బలగాలను పూర్తిగా తుడిచిపెడుతామని, వారు వారం రోజుల క్రితం 1300 మందికి పైగా తమ పౌరులను హతమార్చినందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. అత్యంత జనసమ్మర్థపు గాజా ప్రాంతంలో కీనం 1900 మంది గజన్‌లు వీరిలో అత్యధికులు సాధారణ పౌరులు మృతి చెందినట్లు పాలస్తీనియా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

మృతులలో 600 మందికి పైగా బాలలు ఉన్నారు. ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడులు వరుసగా వచ్చిపడ్డాయని తెలిపారు. గాజా మంత్రిత్వశాఖ నుంచి అందిన సమాచారాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఐరాస సంస్థ గాజాస్ట్రిప్‌లో ఇళ్ల విధ్వంస క్రమాన్ని ప్రకటనలో తెలిపింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాతి లెక్కల ప్రకారం గాజాస్ట్రిప్ నుంచి పారిపోయిన వారు 4,23,000 మందికి పైగా ఉన్నారని ఐరాస మానవీయ సంస్థ తెలిపింది. నిరాశ్రములైన ప్రజల సంఖ్య, వారి పరిస్థితి గురించి ఈ సంస్థ ఎప్పటికప్పుడు ఆరాతీస్తోంది. ఇప్పుడు మరో 11 లక్షల మందిని ఉత్తర ప్రాంతం నుంచి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్ల ఏరివేతకు తాము ఈ ప్రాంతంలో దాడులను మరింత ముమ్మరం చేస్తామని తెలిపింది. భూతల దాడులను ఆరంభించే క్రమంలో పౌరులు అక్కడ ఉండరాదని పేర్కొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తరలిపోతున్న వారి వాహనాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర ప్రాంతంలో ఒక చోట వాహనాల్లో వెళ్లుతున్న వారిపై శతఘ్ని దాడి జరిగింది. దీనితో 40 మందికి పైగా మృతి చెందారు.

పలువురు గాయపడ్డారు.ఈ ఉదంతం గురించి తెలియగానే ఇళ్లు వదిలి ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్లాలనుకునే వారు ఈ ఆలోచన విరమించుకుంటున్నారు. చావైనా బతుకైనా ఉన్నచోటనే ఉందామనే నిర్ణయానికి వచ్చారు. కాగా గాజాస్ట్రిప్ ఇప్పుడు తాగునీరు కటకటతో విలవిలలాడుతోందని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. చేసేది లేక జనం వ్యవసాయ బావుల్లోని నాచుపట్టిన నీటినే తాగాల్సి వస్తోంది. దీనితో తీవ్రస్థాయి కలరా ఇతరత్రా అనారోగ్యాలు వచ్చిపడే ముప్పు ఏర్పడింది. వైమానిక దాడుల క్రమంలో అనేక రిజర్వాయర్లు, మంచినీటి బావులు , వాటర్ పంపింగ్ స్టేషన్లు, జలశుద్ధి ప్లాంట్ దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News