Thursday, January 23, 2025

అణగారిన వర్గాల ఆశాజ్యోతి

- Advertisement -
- Advertisement -

131st birth anniversary celebrations of Dr. Babasaheb Ambedkar

వారి సాధికారత కోసం పరితపించిన మహనీయుడు అంబేద్కర్, ఆయన ఆశయ సాధనలో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దళితబంధు పథకాన్ని చేపట్టాం : ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులు

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని సిఎం కొనియాడారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని సిఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమన్నారు.

ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను కెసిఆర్ స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిలు వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబ్టెలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తున్నదని సిఎం తెలిపారు. దళిత సాధికారత కోసం, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా, దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ. 10 లక్షలభారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నదని సీఎం తెలిపారు.

బడుగు బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భావించిన ప్రభుత్వం అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్య కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయని సిఎం అన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల్లో అర్హులైన వారికి రూ. 20 లక్షలను స్కాలర్ షిప్‌గా అందిస్తూ, వారి కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాలతో వారి జీవనప్రమాణాలు మెరుగై, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని సిఎం పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News