Friday, December 20, 2024

బిఆర్‌ఎస్ నేత క్రిశాంక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లు, మెస్‌లు మూసివేతకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారనే కేసులో బిఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే. బుధవారం క్రిశాంక్‌ను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి టోల్‌గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తొలుత చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత క్రిశాంక్‌ను పోలీసులు ఈస్ట్ మారేడ్‌పల్లిలోని మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ క్రిశాంక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

ఆ తర్వాత పోలీసులు క్రిశాంక్‌ను చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. క్రిశాంక్ ఫేక్ సర్క్యులర్‌లు సృష్టించి ప్రచారం చేశాడని ఓయూ హాస్టల్స్ అండ్ మెస్ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిశాంక్‌పై కేసులు నమోదు చేశారు. ఐపిసి 469, 465, 468, 417, 471, 505 (1) (బి),(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే అంశానికి సంబంధించి నాగేందర్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై బిఆర్‌ఎస్ నేతలు ఖండించారు. తమ పార్టీ యువనేత, ఉద్యమకారుడు క్రిశాంక్‌ను అరెస్ట్ చేయడం అక్రమం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలను, ఢిల్లీ బిజెపి అరాచకాలపై గొంతెత్తినందుకే ఆయనపై దౌర్జన్యం చేశారని కెటిఆర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News