Saturday, November 9, 2024

ముంబయిలోని బార్లు, ఆర్కెస్ట్రాల నుంచి లంచాల వసూళ్లలో సచిన్‌వాజే కీలకం: ఇడి

- Advertisement -
- Advertisement -

14 days remand for Anil Deshmukh

మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు 14 రోజుల రిమాండ్

ముంబయి: ముంబయిలోని బార్ యజమానుల నుంచి లంచాలు వసూలు చేసి ఇవ్వడంలో పోలీస్ అధికారి సచిన్‌వాజేది కీలక పాత్ర అని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్ ఆదేశాలమేరకు ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా ముంబయిలోని బార్లు, ఆర్కెస్ట్రా యజమానుల వివరాలను వాజే అందించారని ఇడి తెలిపింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు 9 రోజులపాటు అనిల్ దేశ్‌ముఖ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని ఇడి కోరగా, కోర్టు తిరస్కరించింది. దేశ్‌ముఖ్‌ను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. మంగళవారం నుంచి శనివారం వరకు దేశ్‌ముఖ్‌ను ఇడి కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఎన్‌సిపి నేత అనిల్‌దేశ్‌ముఖ్ తమ ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారని ఇడి అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో నగదు అక్రమ లావాదేవీలకు సంబంధించి ఇడి దర్యాప్తు జరుపుతోంది. నెలకు రూ.100 కోట్ల చొప్పున ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల యజమానుల నుంచి వసూలు చేసి తనకు ఇవ్వాలని సచిన్‌వాజే ద్వారా పోలీస్ అధికారులను ఆదేశించినట్టు అనిల్‌దేశ్‌ముఖ్‌పై ఆరోపణలున్నాయి. ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్ ఈ ఆరోపణలు చేశారు.

దేశ్‌ముఖ్ కనుసన్నల్లో 27 డొల్ల కంపెనీలు: ఇడి

అక్రమంగా సంపాదించిన డబ్బును 27 డొల్ల కంపెనీల ద్వారా తరలించినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఇడి పేర్కొన్నది. దేశ్‌ముఖ్ కుటుంబసభ్యులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ కంపెనీలను నడిపారని తెలిపింది. ఈ అక్రమ వ్యవహారాల్లో అనిల్ కుమారులు హృషికేశ్‌దేశ్‌ముఖ్, సలీల్‌దేశ్‌ముఖ్, ఇతర కుటుంబసభ్యులకు పాత్ర ఉన్నదని ఇడి తెలిపింది. హృషికేశ్‌కు ఐదుసార్లు సమన్లు జారీ చేసినా తమ ముందుకు రాలేదని ఇడి తెలిపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హృషికేశ్ కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న దానిపై విచారణ జరగనున్నది. ఈ కేసులో ఇప్పటికే అనిల్‌కు సన్నిహితులైన కుందన్‌షిండే, సంజీవ్‌పలాండేను ఇడి అరెస్ట్ చేసింది. వారు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సచిన్‌వాజేను తమ కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 5న ఎన్‌ఐఎ కోర్టును ఇడి కోరింది. ప్రస్తుతం వాజే ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. వాజేను ఓ దోపిడీ కేసులో మహారాష్ట్ర పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News