Sunday, January 19, 2025

14 మందికి పౌరసత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) కింద మొదటి సెట్ పౌరసత్వం సర్టిఫికేట్లను బుధవారం 14 మంది వ్యక్తులకు జారీ చేశారు. కేంద్రం నిబంధనలు రూపొందించిన సుమారు రెండు నెలల అనంతరం ఆ సర్టిఫికేట్ల పంపిణీ జరిగింది. సిఎఎ కింద పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన కారణాలతో వేధింపులకు గురైన, 2014 డిసెంబర్ 31 లోపు భారత్‌కు వచ్చిన మైనారిటీలు భారత్‌లో పౌరసత్వం పొందవచ్చు. వారిలో హిందువుల, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు ఉన్నారు. సిఎఎను పార్లమెంట్ ఆమోదించిన నాలుగు సంవత్సరాల అనంతరం మార్చి 11న కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిబంధనల నోటీఫికేషన్ జారీ చేసింది. 14 మంది వ్యక్తుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేసిన తరువాత వారు బుధవారం పౌరసత్వం సర్టిఫికేట్లు అందుకున్నారు. కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి సర్టిఫికేట్లు అందజేశారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఆ పత్రాల పంపిణీ జరిగిన రోజును ‘చరిత్రాత్మక దినం’గా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొన్నవారి దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ముగిసిందని ఆయన చెప్పారు.

దేశంలో ప్రస్తుతం సాగుతున్న సార్వత్రిక ఎన్నికల నడుమ ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఏప్రిల్ 19న మొదలైన ఎన్నికల్లో చివరి ఏడవ విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. వోట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. సిఎఎను 2019 డిసెంబర్‌లో చేయడమైంది. చట్టం చేసిన తరువాత సిఎఎకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. హోమ్ శాఖ కార్యదర్శి పౌరసత్వం సర్టిఫికేట్లు పంపిణీ చేస్తూ 14 మంది దరఖాస్తుదారులను అభినందించారు. పౌరసత్వ (సవరణ) నిబంధనావళి 2024లోని విశిష్ట అంశాలను ఆయన వివరించారు. సర్టిఫికేట్ల పంపిణీ సమావేశానికి తపాలా శాఖ కార్యదర్శి, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, భారత రిజిస్ట్రార్ జనరల్, సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఆ మూడు దేశాలలో మతపరమైన వేధింపులు తట్టుకోలేక పారిపోయి వచ్చిన హిందు, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవ సోదర సోదరీమణలు భారత పౌరసత్వం పొందసాగారని, దేశ స్వాతంత్య్రం సమయంలో చేసిన వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలియజేశారు. ‘దశాబ్దాల పాటు ఇక్కట్లకు గురైన ఆ ప్రజలకు న్యాయం చేకూర్చినందుకు, హక్కులు ఇచ్చినందుకు మోడీజీకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

మోడీ ప్రభుత్వం మీ అందరికీ సిఎఎ ద్వారా పౌరసత్వం ఇస్తుందని నా శరణార్థి సోదర సోదరీమణులకు హామీ ఇస్తున్నాను’ అని ఆయన‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘మోడీ గ్యారంటీ& వాగ్దానాలు సాఫల్యం చేసే గ్యారంటీ’ అని అమిత్ షా అభివర్ణించారు. దరఖాస్తు పత్రం, జిల్లా స్థాయి కమిటీ (డిఎల్‌సి) దరఖాస్తులను ప్రాసెస్ చేసే విధానాన్ని, రాష్ట్ర స్థాయి సాధికార కమిటీ (ఎస్‌ఎల్‌ఇసి) స్క్రూటినీ, పౌరసత్వం మంజూరు విధానాన్ని సిఎఎ నిబంధనలు సూచిస్తున్నాయి. నిర్దేశిత అధికారులుగా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్లు, లేదా సూపరింటెండెంట్ల సారథ్యంలోని డిఎల్‌సిలు దరఖాస్తుదారులతో విధేయత ప్రమాణం చేయించాయి. నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేసిన తరువాత డిఎల్‌సిలు దరఖాస్తులను డైరెక్టర్ (సెన్సస్ ఆపరేషన్) సారథ్యంలోని ఎస్‌ఎల్‌ఇసికి పంపాయి.

దరఖాస్తు ప్రాసెసింగ్‌ను పూర్తిగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జరిపారు. ఢిల్లీ డైరెక్టర్ (సెన్సస్ ఆపరేసన్) నేతృత్వంలని ఢిల్లీ సాధికార కమిటీ సముచిత స్క్రూటినీ తరువాత 14 మంది దరఖాస్తుదారులకు పౌరసత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా డైరెక్టర్ (సెన్సస్ ఆపరేషన్) ఆ దరఖాస్తుదారులకు సర్టిఫికేట్లు మంజూరు చేసినట్లు అధికార ప్రతినిధి తెలియజేశారు. 2019లో సిఎఎను ఆమోదించడం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దారి తీసింది. ఆందోళనకారులు దానిని‘వివక్షపూరితం’గా పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో సిఎఎ వ్యతిరేక నిరసనల్లో లేదా పోలీస్ చర్యలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిఎఎ ఈ దేశ చట్టం కనుక దీని అమలును ఏ ఒక్కరూ అడ్డుకోజాలరని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News