హైదరాబాద్‌కు చెందిన యాత్రికులతో బీహార్‌లోని గయకు వెళుతున్న ఒక బస్సు శనివారం ఒడిశాలో ఒక ట్రక్కును వెనుకనుంచి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజాము 5.30 గంటలకు ఒడిశాలోని మయూర్‌భని జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బేతనటి పోలీసు స్టేషన్ పరిధిలోని బుదిఖ్మరి సర్కిల్ సమీపంలో 18వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన బస్సు డ్రైవర్ ఉదయ్ సింగ్‌తోసహా ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బస్సులో 20 మంది ప్రయాణిస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రులను బరపడలోని పండిట్ రఘునాథ్ ముర్ము
మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడని, మిగిలిన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని జిల్లా అదనపు వైద్యాధికారి బినయ్ కుమార్ దాస్ తెలిపారు. గాయపడిన 14 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదంలో హైదరాబాదీ యాత్రికుల మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందచేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.