Wednesday, January 22, 2025

నాణ్యత లేని ఆహారంతో 14 మిలియన్ టైప్2 డయాబెటిస్ కేసులు

- Advertisement -
- Advertisement -

అమెరికా లోని టఫ్ట్ యూనివర్శిటీ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ : తీసుకున్న ఆహారంలో నాణ్యత లేకపోవడంతో 1990 2018 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా టైప్2 డయాబెటిస్ కేసులు 14.1 మిలియన్ వరకు పెరిగాయని, ఇందులో 70 శాతం కొత్త కేసులు వచ్చాయని అమెరికా లోని టఫ్ట్ యూనివర్శిటీ అధ్యయనం వెల్లడించింది. మొత్తం 184 దేశాల్లో ఈ అధ్యయనం జరగ్గా, వీటిలో భారత్, నైజీరియా, ఇథియోపియా, వంటి అత్యధిక జనాభా కలిగిన 30 దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారం కారణంగా వచ్చే టైప్ 2 డయాబెటిస్ కేసులు తక్కువ సంఖ్యలో కనిపించాయని అధ్యయన పరిశోధకులు వివరించారు.

జర్నల్ నేచర్ మెడిసిన్‌లో వెలువడిన ఈ అధ్యయనంలో ఎలాంటి ఆహార కారకాల అంశాలు ప్రపంచ వ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తాయో విశ్లేషించారు. ఈ మేరకు 11 అంశాలను గుర్తించారు. వీటిలో మూడు అంశాల్లో విపరీత వినియోగంతో టైప్ 2 డయాబెటిస్ వస్తోందని తెలుసుకున్నారు. తృణధాన్యాలను తగినంతగా తీసుకోకపోవడం, రిఫైండ్ బియ్యం, గోధుమలు ఎక్కువగా వినియోగించడం, ప్రాసెస్ చేసిన మాంసాన్ని అతిగా తీసుకోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఫల రసాలు అతిగా సేవించడం, పిండి పదార్ధాలు లేని కూరగాయలను, గింజలు, విత్తనాలను తగినంతగా ఆరగించక పోవడం వంటివి కొత్త కేసుల్లో తక్కువ ప్రభావం చూపించాయి.

ఏమాత్రం నాణ్యత లేని కార్బొహైడ్రేట్లు తీసుకోవడమే ఆహార సంబంధపరంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తోందని, దేశాల వారీగా, కాలాల వారీగా ఈ కేసుల్లో వైవిధ్యం కనిపించిందని ప్రధాన సీనియర్ పరిశోధకులు డేరియుష్ మొజఫరియన్ వెల్లడించారు. దేశాల వారీగా, ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధుల వినాశకర భారాన్ని తగ్గించడానికి ఈ కొత్త అధ్యయనం అనేక కీలక అంశాలను వెల్లడించిందని చెప్పారు. రక్తం లోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించ డానికి ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్ ను శరీరం లోని కణాలు ప్రతిఘటించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సంక్రమిస్తుంది. క్లోమ గ్రంధి (పాంక్రియాస్) నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News