ప్రభుత్వంపై 14 ప్రతిపక్షాల ఐక్యస్వరం
పెగాసస్ జాతీయ భద్రతా అంశమే కదా
రైతుల ఆందోళన తీవ్రమైనది కాదా
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఇప్పటి ప్రతిష్టంభనకు ప్రభుత్వానిదే బాధ్యత అని 14 ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెగాసస్, రైతుల ఉద్యమం వారి కడగండ్లపై చర్చ జరగాల్సిందే అని ఈ నేతలు బుధవారం స్పష్టం చేశారు. చర్చ జరగాలనే డిమాండ్‌ను మన్నించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమని, ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని గుర్తించాలని తెలిపారు. 14 పార్టీలకు చెందిన 18మంది ప్రతిపక్ష నేతలతో సంయుక్త ప్రకటన వెలువడింది. ప్రతిపక్షాల సంఘటిత శక్తిని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది దురదృష్టకరమని, పార్లమెంట్ కార్యకలాపాలు కుంటుపడటానికి ప్రతిపక్షాలను నిందించడం ప్రభుత్వ వర్గాల ద్వేషపూరిత చర్యలో భాగం అని ఈ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి ప్రతిష్టంభన బాధ్యత అంతా కూడా ప్రభుత్వానికి చెందుతుందని, ప్రతిపక్షాల డిమాండ్‌ను పట్టించుకోకుండా దురుసుగా, అహంకారపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రతిపక్షాలు నిలదీశాయి.
పెగాస్ ఇతర అంశాలపై చర్చ విషయంలో ప్రతిపక్షాలు అన్ని కలిసికట్టుగా ఉన్నాయని,స్థిర చిత్తంతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పెగాసస్ స్నూపింగ్‌పై చర్చ జరగాల్సిందే, హోం మంత్రి అమిత్ షా జవాబు ఇవ్వాల్సిందే అని ఈ విషయాన్ని తాము ముక్తకంఠంతో తెలియచేస్తున్నామని ప్రకటనలో పొందుపర్చారు. జాతీయ భద్రతా అంశం ఇమిడి ఉన్నందున చర్య అత్యవసరం అన్నారు. ఇక రైతుల ఉద్యమం ఇంతకాలంగా సాగుతూ వస్తోందని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సాగుతున్న నిరసనలపై చర్చ కూడా సమాన స్థాయిలో అవసరం అని తాము పేర్కొంటున్నామని వెల్లడించారు. సంయుక్త ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఎన్‌సిపి నేత శరద్ పవార్, డిఎంకె నుంచి టిఆర్ బాలు, తిరుచి శివ, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, ఎస్‌పి సభ్యులు రామ్‌గోపాల్ యాదవ్, టిఎంసి , ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, ఎన్‌సి, ఆర్‌ఎస్‌పి , ఎల్‌జెడి నేతల సంతకాలు ఉన్నాయి. బుధవారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడి ప్రతిష్టంభన దిశలో సాగిన తరువాత ప్రతిపక్ష నేతల సంయుక్త ప్రకటన వెలువడింది.