లాహోర్ : పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కీలకమైన సంస్థలను లక్షంగా చేసుకుని భారీ ఉగ్ర కుట్రకు పన్నాగం పన్నే 14 మంది అనుమానిత ఉగ్రవాదులను తీవ్రవాద నిరోధక పోలీస్‌లు శనివారం అరెస్టు చేశారు. నిందితులు ఐఎస్‌ఐ, టిటిపితోసహా నిషేధ సంస్థలకు చెందిన వారు. నిఘా సమాచారం ఆధారంగా పంజాబ్ ప్రావిన్స్ లోని వివిధ జిల్లాల్లో సోదాలు చేయగా అనుమానిత ఉగ్రవాదులు 14 పట్టుబడ్డారని, వారి నుంచి నిషేధిత వస్తువులు , నగదు స్వాధీనం చేసుకున్నామని ఉగ్రవాద నిరోధక విభాగం వెల్లడించింది.
గుజ్రన్‌వాలా, బహవాల్‌పూర్, సాహీవాల్, ఫైసలాబాద్, సర్గోధ, లాహోర్ ప్రాంతాల్లో ఈ అరెస్టులు జరిగాయని తీవ్రవాద నిరోధక శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. దాదాపు 4.3 కిలోల పేలుడు పదార్ధాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లు, నాలుగు ఐఇడి బాంబులు, 20 డిటొనేటర్లు, 32 అడుగుల ఫ్యూజ్‌వైర్, 6.5 అడుగుల ప్రైమా కార్డు, నిషేధిత సాహిత్యం, కొంత నగదు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిపై 13 కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కోసం వారిని అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.