భువనగిరి క్రైమ్ : యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దిలావర్‌పూర్‌లో 2018లో నమోదైన హత్య కేసులో 14 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు జడ్జి మారుతిదేవి మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని సీస యాదగిరి గౌడ్ అనే వ్యక్తి తరచూ అందరినీ మంత్రాలు చేసి మానసికంగా వేధిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన 14 మంది కలిసి అతనిని హత్య చేశారు. బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. అప్పటి సిఐ కేసును దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు.
నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో హత్య చేసిన 14 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా అదనపు జడ్జి సంచలన తీర్పునిచ్చారు. ఈ కేసును డిసిపి ఆదేశాలతో ప్రాధాన్యత కేసుగా తీసుకుని ప్రాసిక్యూషన్ పూర్తి చేసి ముద్దాయిలకు త్వరితగతిన శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. జీవిత ఖైదు పడిన వారిలో బుర్రి రాజేష్, చొప్పరి శ్రవణ్, సొప్పరి నరేష్, చొప్పరి సత్యనారాయణ, చొప్పరి అంజమ్మ, చెక్కా సత్యనారాయణ, దండు రవి, చొప్పరి శంకర్, చొప్పరి మహేందర్, చొప్పరి సందీప్, చెక్కా సత్తయ్య, మనగల్ల పుల్లయ్య, చొప్పరి రోశయ్య, ర్యాపకా లలిత ఉన్నారు.