యుపి దస్నా జైలులో దుస్థితి
గజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ దస్నా జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకింది. వైద్య పరీక్షల క్రమంలో వీరికి ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణ అయిందని దస్నా జిల్లా జైలు అధికారులు తెలిపారు. ఈ జైలులో లెక్కల ప్రకారం 1706 మంది ఖైదీలనే ఉంచాలి. అయితే ఇప్పుడు దాదాపు 5500 మంది ఖైదీలను ఉంచారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎప్పటికప్పుడు జైలులో టిబి, హెచ్‌ఐవి ఎయిడ్స్ వైద్యపరీక్షలు జరుగుతాయి.
ఎంఎంజి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని జిల్లా జైలు అధికారి అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. 2016లో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోలు సొసైటీ వైద్యులు జరిపిన పరీక్షలలో 49 మందికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. ఎయిడ్స్ లేదా టిబి వంటివి సోకినట్లు నిర్థారణ అయితే వీరిని జైలులోని చికిత్సా కేంద్రంలో ఉంచి చికిత్స జరపడం పద్ధతిగా ఉంది. ఇప్పుడు జైల్లోని 140 మంది హెచ్‌ఐవి పాజిటివ్ రోగులల 35 మందికి క్షయ కూడా ఉందని నిర్థారించారు.