Saturday, November 23, 2024

మెడికల్ కాలేజీల్లో త్వరలో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..

- Advertisement -
- Advertisement -

మెడికల్ కాలేజీల్లో త్వరలో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
నిమ్స్‌లో 250 పడకలు, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్ ఆసుపత్రులు
మతా శిశు మరణాలకు కారణాలను అన్వేషించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం
ప్రసవమైన తర్వాత బాలింతలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయోమో అని పూర్తిగా పరీక్షించాకే ఇంటికి పంపాలి
-రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో త్వరలో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీతో రాష్ట్రంలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు. నిమ్స్‌లో 250 పడకలు, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్ (మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్) ఆసుపత్రులు తీసుకువస్తున్నామని ప్రకటించారు. కెసిఆర్ కిట్, మిడ్ వైఫరీ వ్యవస్థ, అమ్మ ఒడి వాహనాలు, న్యూట్రిషన్ కిట్ వంటి సదుపాయాలు గర్భిణీలకు కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం నగరంలో పాతబస్తీలోని పేట్లబురుజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్ల నివారణ- అవగాహన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. పేట్లబురుజు ఆస్పత్రికి ఎక్కువగా క్రిటికల్ కేసులు వస్తాయని, కాబట్టి ఇక్కడ మరణాల సంఖ్య పెరగకుండా చూడాలని సంబంధిత అధికారులను, వైద్య సిబ్బందిని మంత్రి కోరారు.

మాతా శిశు మరణాల విషయంలో రాష్ట్రం చాలా మెరుగైందని.. అయినప్పటికీ మరణాలకు గల కారణాలపై లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రుల సంఖ్య పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంఎంఆర్ విషయంలో మన రాష్టంలో లక్ష డెలివరీలకు 2014లో 92 ఉండగా, 2022లో 43కు తగ్గించామని చెప్పారు. మాతా శిశు మరణాల్లో ఒకప్పుడు తెలంగాణ ఐదు, ఆరు స్థానంలో ఉందని, ఇప్పుడు ఏడాదికి లక్షకు 43 మాతాశిశు మరణాలతో మూడో స్థానంలో ఉందని మంత్రి వివరించారు. జాతీయ సగటుతో పోల్చుకుంటే మనం మెరుగ్గా ఉన్నామని అన్నారు. నియోనెటల్ విషయంలో వెయ్యికి 2014లో 25 ఉంటే 2022లో 15కి తగ్గిందని తెలిపారు.

4 లక్షల మంది గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 82 శాతం ప్రసవాలు అంటే సగటున నెలకు 1,400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని వెల్లడించారు. ప్రసవమైన తర్వాత బాలింతలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయోమో పరిశీలించాలని.. పూర్తిగా పరీక్షించాకే ఇంటికి పంపాలని సూచించారు. మాతా శిశు మరణాల నియంత్రణ కోసం మరింత కష్టపడి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుపుదామని సంబంధిత అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. మతా శిశు మరణాలకు కారణాలను అన్వేషించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలలో రవాణా సదుపాయాలు లేక మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీల సమస్యలు గుర్తించగలిగితే మరణాల సంఖ్య తగ్గించవచ్చని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పేట్లబురుజు ఆసుపత్రిలో రోగులతో మంత్రి హరీశ్‌రావు ఆత్మీయంగా మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News