Friday, November 15, 2024

1540 కొలువులొచ్చాయ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేస్తున్న 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. వెరిఫికేషన్ సహా, ఇతర ప్రక్రియలు పూర్తి అయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మంగళవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. డిఎంఇ, డిపిహెచ్, టివివిపి పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2021- 22తో పోల్చితే, 2022- 23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. డిఎంఇ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టివివిపిలో 66,153 నుంచి 99,744కు పెరిగాయని తెలిపారు. డిపిహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం కావడం వల్ల 14,965 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

వెల్‌నెస్ సెంటర్ల పనితీరును సమీక్షించాలి

కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరిన్ని పిజి సీట్లు అందుబాటులోకి రావడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగటం, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి అన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు మొదలు పెట్టడం వల్ల ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ బృందంతో పాటు, ఆరోగ్య మిత్రలు చేస్తున్న కృషి కూడా ఇందులో ఉందని చెప్పారు. ఇహెచ్‌ఎస్, జెహెచ్‌ఎస్ పథకాలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. వెల్‌నెస్ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య శ్రీ సిఇఒ విశాలాచ్ఛి, డిఎంఇ రమేష్ రెడ్డి, నిమ్స్, ఎంఎన్‌జె డైరెక్టర్లు, ఆరోగ్య శ్రీ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, టీం లీడర్లు, అన్ని టీచింగ్, టివివిపి ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలు పాల్గొన్నారు.

1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో షేర్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి ఆశా కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ పోస్టులు భర్తీ చేయనుండగా, హైదరాబాద్‌లో 323 పోస్టులు, మేడ్చల్ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 మంది ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా నియామక కమిటీల ద్వారా భర్తీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News