యుపిలో పనిచేయని ప్రియాంక నారీ నినాద్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున 148 మంది మహిళలు పోటీ చేయగా వీరిలో ఒకే ఒక్కరు గెలిచారు. పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చిన లడ్‌కీ హూ లడ్ సక్తాహూ నినాదం ఆసరాగా చేసుకుని అభ్యర్థినులు పోటీ బరిలోకి దిగారు. అయితే గెలుపు దిశలో సత్తా చాటుకోలేకపొయ్యారు. యుపిలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీ చేపట్టారు. మహిళా అభ్యర్థులకు 40 శాతం వరకూ టికెట్లు ఇస్తామని ప్రియాంక వాగ్దానం చేయడంతో అందుకు అనుగుణంగానే ఏ ఇతర పార్టీ ఇవ్వని రీతిలో ఈసారి 148 మంది మహిళలు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే వీరిలో కాంగ్రెస్ లెజిస్లేచర్ నాయకురాలుగా ఉన్న ఆరాధన మిశ్రా మోనా ఒక్కరే గెలుపు సాధించారు. ఉన్నావో సదర్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశాదేవీని నిలిపారు. అక్కడ అత్యాచార బాధితురాలైన బాలిక తల్లి అయిన ఆశాదేవీకి కేవలం 1555 సీట్లు వచ్చాయి.
కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మహిళలల్లో పలువురికి 3000 ఓట్ల కన్నా తక్కువ పోలయ్యాయి. అత్యధికులు ధరావత్తు పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి పలు మహిళా ఉద్యమాలతో సంబంధాలు ఉన్న వారిని ఎంపిక చేసుకునే టిక్కెట్లు ఇచ్చింది. అయితే ఫలితం దక్కలేదు. ఉన్నావ్ నుంచి ప్రియాంక అక్కడ అత్యాచార బాధితురాలినే పార్టీ తరఫున నిలబెట్టాలని భావించారు. అయితే తాను ఈసారి పోటీకి దిగబోనని తెలియచేయడంతో తల్లిని పోటికి నిలిపారు. ఆమె ఓడిపోవడంపై కూతురు స్పందిస్తూ పరాజయం ఊహించిందేఅని, అయితే మహిళల కోసం ఉద్యమించడంలో ఓడిపోయేది లేదని , వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ఇప్పటి నుంచే సిద్ధం అవుతానని కూతురు ప్రకటించారు. పలు ప్రముఖ రంగాలకు చెందిన మహిళలను కూడా కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి ఎన్నికలలో నిలిపింది. టీవీ జర్నలిజాన్ని వదిలి సంభాల్ నుంచి నీదా అహ్మద్ బరిలోకి దిగారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పలు చోట్ల ప్రచారానికి దిగారు. అయితే ఆమెకు కేవలం 2256 ఓట్లే దక్కాయి. ఇక హస్తిన్‌పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున నిలిచిన అర్చనా గౌతమ్ మిస్ కాస్మో వరల్డ్ 2018, మిస్ యుపి 2014గా ఉన్నారు. కాంగ్రెస్ తరఫున దళిత నాయకురాలిగా పోటీ చేశారు. అయితే ఆమెకు కేవలం 1519 ఓట్లే వచ్చాయి.