Tuesday, January 7, 2025

రాంనూతల శివార్లలో వెలుగు చూసిన 14వ శతాబ్దం నాటి పద్మనాయకుల రేఖాచిత్రాలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం రాంనూతుల శివార్లలో ఉన్న అనంతగిరి (అంతరగిరి) గుట్టలలోని గుహలలో క్రీ.శ. 14 వ శతాబ్దం నాటి పద్మనాయకుల కాలపు రేఖాచిత్రాలు (పెట్రోగ్లిఫ్స్) కనిపించాయి. ఇవి తెలంగాణ చరిత్రకు తొలిసారిగా తెలియ వస్తున్నాయి. గత ఏకాదశి పండుగనాడు తెలంగాణ చరిత్రకారుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ ఆమనగల్ సమీపం లోని అయ్యసాగర్ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళి పక్కనే ఉన్న బ్రహ్మదేవునిగుట్ట, విష్ణుదేవుని గుట్ట (అనంతగిరి) లను పరిశీలించినప్పుడు ఈ పెట్రోగ్లిఫ్స్ కనిపించాయి. అయితే తను వెళ్ళేటప్పటికే ఈ షెట్రోగ్లిఫ్స్ ఉన్న గుహలకు స్థానిక లంబాడీ గిరిజనులు సున్నం పూయడంతో చరిత్ర పూర్వ యుగపు ఆదిమానవులు వేసిన ఎరుపు రంగు బొమ్మలు (వేల సంవత్సరాల క్రితపువి) కనుమరుగైపోయాయని, ఆ గిరిజనులే పెట్రోగ్లిఫ్స్ కేమో జాజు పూసి వాటిని దేవీ దేవతలుగా పూజిస్తున్నారని సత్యనారాయణ తెలిపారు.

అనంతగిరి గుహల్లో ప్రస్తుతం మూడు చోట్ల పెట్రోగ్లిఫ్స్ కనిపిస్తున్నాయని. ప్రధాన గుహ, నైరుతి గుహ, గుండు పాదం తూర్పుకు అభిముఖంగా ఉన్న పడగరాయి కింది ప్రధాన గుహలో శివలింగం పైనున్న అడ్డరాయికి ఒక చోట అడుగు పొడవు, అరడుగు వెడల్పు పరిమాణంలో గుర్రం, వినాయకుల రేఖా చిత్రాలుండగా, అదే రాయికి మరో పక్కన నిలుచుని పడగ విప్పిన నాగుపాము రేఖా చిత్రమున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన గుహకు నైరుతి వైపున ఉన్న సొరికెలో ఒక యోగి రేఖాచిత్రం ఉందని, కాలు మీద కాలు వేసుకుని పద్మాసనంలో కూర్చుని ఉన్న ఈ యోగి బాగా పెరిగిపోయిన తన వెంట్రుకల జడలను తలపై నాలుగు వరుసలుగా ముడుచుకున్నట్లున్నాడని తెలిపారు. ఆయన తలకు ఇరు వైపులా ఉన్న రంధ్రాలు ఒకనాటి ప్రజలు వాటిల్లో కట్టె ముక్కలను చెక్కి వాటి మీదుగా ఆ యోగి మెడకు పూల మాలలు వేసి పూజించేవారని అర్థమవుతోందన్నారు గుహకు ఆగ్నేయంలో ఉన్న గుండు పాద భాగంలో రెండు అడుగుల ఎత్తులో పబ్బతి ఆంజనేయుడు, గరుత్మంతుల రేఖాచిత్రాలున్నట్లు తెలిపారు.

14వ శతాబ్దపు ఆనవాళ్ళు:
క్రీ.శ. 14 వ శతాబ్దంలో తెలంగాణను పాలించిన రేచర్ల పద్మనాయకులు తమ శిలాశాసనాలలో తాము ఆమనగంటి పురవరాధీశ్వరులము అని చెప్పుకున్నారని, వారు తాము కట్టించిన కోటగోడలు, గుళ్ళు, గుహాలయాల ముందర హనుమంతుడు, గరుత్మంతుడు, వినాయకుడు, శివలింగం, నాగ సర్పం బొమ్మలను, శిల్పాలను చెక్కించాచినట్లు వివరించారు. పద్మనాయకులలో రెండో సింగభూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడు 14వ శతాబ్దం ఉత్తరార్థంలో దక్షిణాదిన ఉన్న కంచిపై దండెత్తినప్పుడు అక్కడి వైష్ణవ సిద్ధాంత వేత్త వేదాంత దేశికులకు అనుయాయుడై తన దేశానికి ఆహ్వానించగా ఆయన తన కుమారుడు నైనాచార్యను పంపాడన్నది చరిత్ర అని, కాబట్టి పద్మనాయకులు వేదాంత దేశికులదో, నైనాచార్యులదో రేఖా చిత్రం వేయించేవారని, వారు ఆమనగల్ నుంచి ఎదిగినామని చెప్పుకున్నారు కాబట్టి తమ తొలి రాజధాని ఆమనగల్ కు 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి గుహలలో పై రేఖాచిత్రాలను వేయించి ఉంటారని డా. సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఇలాంటి అరుదైన ఆరున్నర శతాబ్దాలనాటి రేఖా చిత్రాలను రాష్ట్ర పురావస్తుశాఖ రక్షించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News