బెంగళూరు: కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్ ) నేత హెచ్‌డి కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరతారన్నారు. చిత్రదుర్గ మాజీ శాసనమండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జెడిఎస్‌లో చేరతానని స్వయంగా చెప్పినట్టు తెలిపారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు చెందిన 15 మంది నేతలు జేడీఎస్‌లో చేరతారని పేర్కొన్నారు. గతంలో జేడీఎస్‌ను ముంచేందుకు ఎమ్‌ఎల్‌ఎలను కాంగ్రెస్ తీసుకెళ్లింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జేడీఎస్ లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. జేడీఎస్ అభ్యర్థుల రెండో జాబితాను సోమవారం విడుదల చేస్తామని కుమారస్వామి వెల్లడించారు. మరోవైపు మాజీ ఎంపీ, బహిష్కృత జెడీఎస్ నాయకుడు ఎల్‌ఆర్ శివరామే బుధవారం బీజేపీలో చేరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్‌లో అంతర్గత రాజకీయాలు, ఘర్షణలు ఎక్కువని విమర్శించారు. సూచనలను బహిరంగంగా వ్యక్తీకరించే హక్కు కూడా ఉండదన్నారు. అందుకే యూత్ కాంగ్రెస్ నాయకుడినైన తాను తొలుత కాంగ్రెస్‌ను, తరువాత జేడీఎస్‌ను వీడి బీజేపీలో చేరినట్టు చెప్పారు. రాబోయే 10 రోజుల్లో చాలా మంది నాయకులు బీజేపీలో చేరతారని తెలిపారు.