Friday, November 22, 2024

లోక్ సభ బరిలో 15 మంది మాజీ సిఎంలు !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలయింది. అత్యధిక సీట్లు గెలవాలని పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన స్థానాల్లో గట్టి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. ఇందులో భాగంగానే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రులను జాతీయ పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం 15 మంది మాజీ సిఎంలు ఈసారి లోక్‌సభకు పోటీపడబోతున్నారు. వీరిలో 12 మంది ఎన్డీఏ కూటమి నుంచి ఉండగా, ఇండియా కూటమి నుంచి ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి పోటీలో ఉన్న వారిలో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.

వీరిలో అత్యధిక కాలం సిఎంగా పనిచేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌.. అతి తక్కువగా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉత్తర్‌ప్రదేశ్ సిఎం జగదాంబికా పాల్ ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిషా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనే కాకుండా అస్సాం మాజీ సిఎం సర్బానంద సోనోవాల్‌ కూడా లోక్‌సభ బరిలో ఉన్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేవ్‌, ఉత్తరాఖండ్‌ మాజీ సిఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. జార్ఖండ్‌ మాజీ సిఎంగా అర్జున్‌ ముండా, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రస్తుత 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్‌ శెట్టర్‌, బసవరాజ్‌ బొమ్మైలు కూడా ఈసారి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌లు కూడా ఈసారి లోక్‌సభకు పోటీ పడుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నబంతుకి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కర్ణాట‌క మాజీ సిఎం కుమార‌స్వామి.. ఆ రాష్ట్రంలో ఒకసారి బిజెపి, మరోసారి కాంగ్రెస్‌ మద్దతుతో సిఎంగా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో బిజెపి, జెడిఎస్ పొత్తులో భాగంగా ఆయన మండ్యా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో బిజెపి సిట్టింగ్ ఎంపీ సుమలతకు హై కమాండ్ మొండిచేయి ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News