బస్సు, ట్రక్కు ఢీ 15మంది దుర్మరణం
హైదరాబాద్ నుంచి యూపిలోని గోరఖ్‌పూర్ వెళ్తుండగా దుర్ఘటన
మృతులంతా దీపావళి కోసం సొంత ఊళ్లకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు
రేవా: మధ్యప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 15 మంది దుర్మరణం చెందారు. వీరిలో అత్యధికులు కూలీలే. దీపావళి పండుగ తమ ఊళ్లలో నిర్వహించుకునేందుకు వీరు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు ప్రైవేటు బస్సులో వెళ్లుతుండగా ఓ ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో సుహా గి పహారి వద్ద తియోనతహార్ పట్టణం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. సోహాగి ఘట్టిలో కొండల నడుమ రాదారిపై వెళ్లుతుండగా జరిగిన ఈ ఘటనలో 35 మంది వరకూ గాయపడ్డారు. బస్సు అంతా కిక్కిరిసి ఎక్కువ మందితో వెళ్లుతూ ఉం డగా ట్రక్కు ను ఢీకొందని రేవా ఎస్‌పి నవనీత్ భాసిన్ విలేకరులకు తెలిపారు. మృతులంతా ఉత్తరప్రదేశ్ వారే. ఉపాధి కోసం హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ బతుకుగడుపుతున్నా రు. తమ ఊళ్లకు వెళ్లుతున్నామనే ఆనందం, తమ వారిని కలుసుకోవచ్చుననే ఆలోచనలు అన్ని ఆవిరి అయ్యాయి. బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడైంది. ప్రమాదం గురించి రేవా కలెక్టర్ మనోజ్ పుష్ప్ వివరాలు వెల్లడించారు. రాదారిపై ముందు ఓ ట్రాలీ ట్రక్కు మరో ట్రక్కును ఢీకొందని, వేగంగా వెనుక వస్తు న్న బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినా అది అదుపు తప్పి ముందున్న ట్రక్కు, ట్రాలీలోకి దూసుకుపోయిందని తెలిపారు. దీనితో బస్సు నుజ్జునుజ్జు అయిం ది. ఈ ప్రాంతానికి వెంటనే సహాయక బృందాలు తరలివెళ్లాయని సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ము ఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేసింది. మృతులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా హృదయవిదారక ఘటన అని స్పందించారు. కూలీలు ఉత్తరప్రదేశ్ వారని వీరు హైదరాబాద్ నుంచి బయలుదేరారని, ఘటన తరువాత తాను యుపి సిఎం ఆదిత్యానాథ్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. సిఎం ఆదిత్యానాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ 50 వేలు చొ ప్పున సాయం అందిస్తామని వివరించారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకర ఘటన అని, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి రూ 50000 చొప్పున ఇస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
గాయపడ్డ ప్రయాణికుడు సుభాష్ కథనం
ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలం మహారాజ్‌గంజ్‌కు పండుగ కోసం బయలుదేరానని, మార్గమధ్యంలో భోజనం చేసిన తరువాత నిద్రలో ఊర్లో దీపావళి చేసుకుంటున్నట్లు కల వచ్చిందని, ఈ లోగా భారీ శబ్ధాలు విన్పించిందని, బస్సులో అరుపులు ఏడుపులు భయానక స్థితి ఏర్పడిందని తాను పలువురు ఇతరులు గాయపడినట్లు, కొందరు చనిపోయి ఉన్నట్లు గుర్తించానని బస్సు ప్రయాణికుడు సుభాష్ చౌదరి తెలిపారు. చౌదరికి తలకు, చేతులకు గాయాలు అయ్యాయి. రేవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పలువురిని యుపికి తరలించి, అక్కడి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.
15 killed in Bus Accident in UP