శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని రాజౌరీని అంతుచిక్కని మరణాలు వెంటాడుతున్నాయి. జిల్లా లోని బుధాల్ గ్రామంలో గడిచిన నెలన్నర వ్యవధిలో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 15కు చేరింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సాంక్రమిక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడి పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఈమేరకు దర్యాప్తు కోసం 11 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
బుధాలి గ్రామంలో గత డిసెంబర్ 7న సహపంక్తి భోజనం నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇక్కడ భోజనం చేసిన తరువాత అస్వస్థతకు గురికాగా, వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 12న మరో కార్యక్రమంలో విందు ఆరగించిన మరో కుటుంబం లోని తొమ్మిది మంది అనారోగ్యం పాలయ్యారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. జనవరి 12న మూడో సంఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం లోని పదిమంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వీరిలో ఆరుగురు చిన్నారులు.
వీరిలో పదేళ్ల బాలిక బుధవారం రాత్రి చనిపోగా, 15 ఏళ్ల అబ్బాయి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇలా గడిచిన నెలన్నర వ్యవధిలో మొత్తం 15 మంది చనిపోవడం ఆ గ్రామంలో భయాందోళనలకు దారి తీస్తోంది. ఈ మరణాలకు కారణాలపై వైద్య ఆరోగ్యశాఖ ముమ్మర ప్రయత్నాలు చేసింది. బాధితుల నమూనాలు అన్ని చోట్ల పరిశోధక ల్యాబ్‌లకు పంపి పరీక్షించినా వైరస్, లేదా బ్యాక్టీరియా కారణాలు లేవని తేలింది. అయితే ఐఐటీఆర్ నిర్వహించిన పరీక్షలో ఆ నమూనాల్లో విషపూరిత పదార్ధాలు ఉన్నట్టు తేలింది. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వివిధ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.