నగర శివారులోని సిపిఐ భూ పోరాట కేంద్రం గుడిసెవాసుల కాలనీలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తునఎగిసిపడిన మంటలకు వందలాది గుడిసెలు పూర్తిగా ఆహుతయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూరు భూదాన్ రావినారాయణరెడ్డి కాలనీ ఫేస్-=3 సిపిఐ గుడిసెల భూపోరాట కేంద్రంలో చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఓ గుడిసెలో మంటలు చెల్లరేగాయి. ఆ మంటలు సమీపంలో ఉన్న గుడిసెలకు వ్యాప్తించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడాన్ని గమనించిన గుడిసెవాసులు సిపిఐ నాయకులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన నాయకుల అక్కడి నుండి ప్రజలను బయటకు పంపించారు.
అగ్నిప్రమాదం విషయంపై ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించటంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు మంట వ్యాప్తిని నివారించే చర్యలు తీసుకున్నారు. ఆయా గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ల పేలుడు, భారీ శబ్దాలకు జనం పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే సిపిఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈటి నర్సింహ, నేతలు ఆందోజు రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణతో కలిసి అగ్నికి అహుతైన గుడిసెలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
భారీగా అస్తి నష్టం…
ఈ అగ్నిప్రమాదంలో వందలాది గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సిలిండర్లు, స్టవ్‌లు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, జొన్నలు, నగదు, బంగారం, వెండి, కుట్టుమిషన్లు ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి అహుతయ్యాయని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 150 గుడిసెలు అగ్నిప్రమాదంలో భష్మీపటలం అయ్యాయని రెవిన్యూ అధికార్లు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో భారీగా అస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. బాధితులకు తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి వంటసామగ్రి, దుప్పట్లు అందించారు.