అంచనాలను తలకిందులు చేస్తూ
జూనియర్ లైన్‌మెన్‌గా ఉద్యోగం పొందిన 150 మంది మహిళలు
సముచిత స్థానం కల్పించిన విద్యుత్ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళలకు విద్యుత్ శాఖ సముచిత స్థానం కల్పిస్తోంది. ఇన్నేళ్లుగా విద్యుత్ స్తంభాలను మహిళలు ఎక్కలేరంటూ వారిని ఆ విధుల్లోకి తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేసేవారు. ప్రస్తుతం అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభుత్వం నిర్వహించిన స్తంభాలు ఎక్కే పరీక్షల్లో ఉత్తీర్ణులైన సుమారు 150 మంది మహిళలు జూనియర్ లైన్‌మెన్‌గా ఉద్యోగాలను దక్కించుకున్నారు. విద్యుత్ రంగంలో స్తంభాలు, టవర్లు ఎక్కి మరమ్మతులు చేయడం మహిళల వల్ల కాదంటూ ఇన్నాళ్లుగా ఆ పోస్టులకు అధికారులు దూరం పెట్టారు. ఇన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళలు ముందంజలో నిలవడం గమన్హారం.
2017 సంవత్సరంలో జూనియర్ లైన్‌మెన్ పోస్టు కోసం…
ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్‌మెన్ పోస్టు కోసం 2017 సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారి మహిళలకు అవకాశం కల్పించింది. దీంతో ఐటీఐ ఎలక్ట్రీషియన్ పూర్తి చేసిన పలువురు మహిళలు ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎత్తైన విద్యుత్ టవర్లను సునాసంగా ఎక్కి వారు తుది పరీక్షలో ఎంపికయ్యారు. కోర్టు కేసులతో మూడేళ్లు ఆలస్యం జరిగినా వీరి ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. దసరా కానుకగా ట్రాన్స్‌కో అధికారులు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందజేశారు. మొత్తం 650 మందిలో 150 మందికి పైగా మహిళలు ఉన్నారు. సంస్థలో ఇప్పటివరకు లైన్‌ఉమెన్లు లేరని తెలంగాణ వచ్చాక ఒకేసారి పెద్ద ఎత్తున నియామకం చేపట్టామని అధికారులు తెలిపారు.