Sunday, October 6, 2024

1500 మంది భద్రత సిబ్బందితో పకడ్బందీ వ్యూహం

- Advertisement -
- Advertisement -

48 గంటల ఆపరేషన్
36 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు పొడుగునా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది నక్సలైట్లు హతమయ్యారు. 48 గంటల పాటు దాదాపు 1500 మంది భద్రత సిబ్బందితో సాగించిన ఈ ఆపరేషన్ గురించిన వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన 1500 మంది జవాన్లు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు దంతెవాడ అదనపు ఎస్‌పి ఆర్‌కె బర్మన్ తెలియజేశారు. పకడ్బందీ వ్యూహంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు, గురువారం (3) ఉదయమే ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

మావోయిస్టులకు చెందిన కంపెనీ నంబర్ 6, తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, థుల్థులి, నెండూర్, రెంగవయా గ్రామాల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందని, దానిని రూఢి చేసుకున్న తరువాత ఆపరేషన్ చేపట్టామని బర్మన్ తెలియజేశారు. ‘ఆపరేషన్ చేపట్టేందుకు భద్రత బలగాలు తీవ్రంగా శ్రమించాయి. మావోయిస్టుల కంట పడకుండా ఎత్తైన కొంద ప్రాంతానికి చేరుకునేందుకు పది కిలో మీటర్ల మేర ద్విచక్ర వాహనాలపై వెళ్లి, ఆ తరువాత 12 కిలో మీటర్ల మేర నడవవలసి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. నెండూరు ధుల్థులి గ్రామాల్లో చీకటి పడే వరకు కాల్పులు సాగాయి. శుక్రవారమే 28 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, శనివారం మరి ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఈ ఆపరేషన్‌కు సిఆర్‌పిఎఫ్ బలగాలు కూడా సహకారం అందించాయి’ అని బర్మన్ తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులను పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)కి చెందినవారిగా గుర్తించామని బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్ తెలియజేశారు. మృతదేహాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత వారు ఎవరెవరన్నది తేలుతుందని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఒక జవాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రస్తుతం అతనికి చికిత్స సాగుతున్నదని ఆయన చెప్పారు. భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సుందర్‌రాజ్ తెలియజేశారు.

ఎకె47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, ఎల్‌ఎంజితో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని సుందర్‌రాజ్ తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌తో బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 188కి పెరిగింది. చివరగా ఏప్రిల్ 16న కాన్కేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మృతి చెందారు. వారిలో ఉన్నత కేడర్‌కు చెందినవారు కూడా ఉన్నాట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు.

ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు హతం

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున గాలింపు సాగుతోంది. మరొక వైపు ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. కమలేశ్ ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతానికి చెందినవారు. ఊర్మిళది బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News