Sunday, December 22, 2024

మహిళలపై నేరాలు.. 151 మంది ప్రజాప్రతినిధులపై కేసులు

- Advertisement -
- Advertisement -

16 మందిపై అత్యాచార ఆరోపణలు
అగ్రస్థానంలో బెంగాల్, ఆంధ్రప్రదేశ్
కేసులు ఎదుర్కొంటున్న 24 మంది బిజెపి ప్రజాప్రతినిధులు
తర్వాతి స్థానంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ
ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ప్రజాప్రతినిధులు
బయటపెట్టిన ఎడిఆర్ నివేదిక

న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు పాల్పడిన ఆరోపణలకు సంబంధించిన కేసులు తమపై ఉన్నాయని దాదాపు 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తమ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారని, ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలల అత్యధికులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ తన తాజా నివేదికలో తెఇపింది. 2019 నుంచి 2024 వరకు దేశంలో జరిగిన ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన 4,809 అఫిడవిట్లలో 4,693 అఫిడవిట్లను ఎడిఆర్ అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది.

మహిళలకు సంబంధించి నేరాలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్న వారిలో 16 మంది సిట్టింగ్ ఎంపీలు, 135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎడిఆర్ తెలిపింది. వీరిలో పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే అగ్రస్థానంలో ఉన్నారని, 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. 21 మందితో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉందని ఎడిఆర్ తెలిపింది. 17 మందితో ఒడిశా ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ట్రెయినీ డాక్టర్ హత్యాచారం, మహారాష్ట్రలోని థాణెలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజాస్రతినిధులు కూడా ఈ తరహా కేసులను ఎదుర్కొంటున్నట్లు ఎడిఆర్ బయటపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలకు సంబంధించి తమపై కేసులు ఉన్నాయని 16 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారని ఎడిఆర్ తెలిపింది. వీరిపై ఐపిసిలోని 376 సెక్షన్ నమోదైంది. ఈ నేరం రుజువైతే వీరికి గరిష్ఠ స్థాయిలో 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ కేసులను ఎదుర్కొంటున్న ఈ 16 మందిలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకే బాధితురాలిపై పదేపదే నేరానికి పాల్పడినట్లు కూడా కొందరిపై అభియోగాలు నమోదు కావడం కేసుల తీవ్రతను తెలియచేస్తున్నట్లు ఎడిఆర్ తన నివేదికలో పేర్కొంది. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్న వారిలో బిజెపికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. బిజెపికి చెందిన 54 మంది ఎపీలు, ఎమ్మెల్యేలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటుండగా తరువాతి స్థానంలో 23 మందితో కాంగ్రెస్, 17 మందితో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు ఎడిఆర్ తెలిపింది. బిజెపి, కాంగ్రెస్‌కు చెందిన చెరో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News