13 నెలల్లో 173 కోట్ల టీకా డోసుల పంపిణీ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. ముందు రోజు 13 వేలకు తగ్గిన కొత్త కేసులు తాజాగా కాస్త పెరిగాయి. మంగళవారం 11లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 15,102 మందికి వైరస్ సోకింది. 24 గంటల వ్యవధిలో 278 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ మొత్తం కేసులు 4.28 కోట్లకు చేరగా, 5,12,622 మంది మరణించారు. ఇక రెండు లక్షల దిగువకు చేరిన క్రియాశీల కేసులు ప్రస్తుతం మరింత తగ్గాయి. ఆ కేసుల సంఖ్య 1.64 లక్షలకు పడిపోయింది. క్రియాశీల రేటు 0.38 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.42 శాతానికి పెరిగింది. కొంతకాలంగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. మంగళవారం 31 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4.21 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మంగళవారం 33 లక్షల మంది టీకా వేయించుకున్నారు. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలియజేసింది.