Saturday, November 16, 2024

పదునైన ధిక్కారస్వరం జ్వాలాముఖి

- Advertisement -
- Advertisement -

14-12-2023న విఖ్యాత కవి, అమరుడు జ్వాలాముఖి 15వ వర్ధంతి. ఈ సందర్భంలో నివాళిగా కొన్ని జ్ఞాపకాలు]
దిగంబరకవిగా, విప్లవకవిగా, మహావక్తగా పేరుగాంచిన రచయిత, విప్లవ కార్యశీలి జ్వాలాముఖి. మానవతా వాదిగా మొదలై, నాస్తిక హేతువాద ఉద్యమాలలో దూకి, ఆపై గతితార్కిక భౌతిక వాదాన్ని వంట పట్టించుకుని తెలుగు సాహిత్య రంగంలో వచ్చిన ప్రగతిశీల సంస్కరణ, అభ్యుదయ విధానాలను దాటుకుంటూ విప్లవ కవిగా తనదైన ముద్రను నెలకొల్పుకున్న విశిష్టకవి, మనీషి జ్వాలాముఖి మతం స్వార్థపరుల ఆట విడుపు. సమాజంలో అది సాత్వికాభినయం చేస్తుంది. జీవితం లో తామసమై విజృంభి స్తుంది. వ్యవస్థలో రాజసమై వర్ధిల్లుతుంది. బతుకు భయాన్ని కలిగించి, విచక్షణా జ్ఞానాన్ని దెబ్బ తీసే మతం అభ్యుదయాన్ని అడ్డుకుంటుంది. మన సమాజం మీద కొనసాగుతున్న గతకాలపు పట్టే మతం. ఈ పట్టులోనుంచి ప్రజలు భౌతికంగా బయట పడ్డా, మానసికంగా బయట పడలేదు. అని భావించేవారు జ్వాలాముఖి.

హైదరాబాధలు అనే శీర్షికతో జ్వాలాముఖి రాసిన కొన్ని కథలు ఇదే ఎరుకను కలిగిస్తాయి. ఈ కథలలో జ్వాలాముఖి లోని మత సామరస్య భావన, ఒక సంయోగ సమ్మిళిత సంస్కృతి పట్ల ఆరాధన, అది విచ్చిన్నమై పోతున్నందుకు వేదన, వ్యగ్రత, దాన్ని పునరుద్ధరించుకోవాలనే ఆరాటం, నిబద్దత స్పష్టంగా కనిపిస్తాయి.భస్మ సింహాసనం కావ్య సంపుటిలో కూడా మతం పేరిట జరిగిన, జరుగుతున్న మారణ హోమాలను నిరసిస్తూ, విశ్లేషిస్తూ, రసోద్వేగ భరితంగా, మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించే కవితా వ్యాఖ్యానం చేశారు. వీరు మత కల్లోలాలను నిరసిస్తూ అనేక కవితలుగా స్పందించడమే కాక, ఆయా సందర్భాలలో నిజనిర్ధారణ కమిటీలు, శాంతికమిటీల ద్వారా విశేషంగా కృషి చేసారు. పలుచోట్ల సమావేశాలలో పాల్గొని మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రసంగించారు. మత సామరస్యత కోసం కృషి చేశారు. భాధితులకు ఓదార్పుగా, సమర శీలంగా వెన్నంటి నిలిచేరు. ఆయన మరణించిన పదిహేను సంవత్సరాల తరువాత కూడా ఆయన కథలు, కావ్యాలు విప్పి చెప్పిన పాఠాలు మరింత ప్రాసంగికంగా వుండటమే నేటి సమాజం లోని విషాదం. అందువల్లనే ఆయన నిత్య స్మరణీయుడు గా మనముందు నిలిచి పోయారు.

ఏ సాహిత్యమైనా యుగ అవసరాలకు భిన్నంగా రాదు కానీ వచ్చిన ప్రతిదీ యుగ అవసరాలను తీరుస్తుందని చెప్పలేము అనేవారు జ్వాలాముఖి. తెలుగు సాహిత్య సీమలో తీవ్ర సంచలనం రేపిన దిగంబర కవితోద్యమంలో ప్రజా దృక్పధంతో నడిచి అత్యంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవాడు జ్వాలాముఖి. 1965 నుండి 1968 వరకు సాగిన ఆ సాహిత్య ఉద్యమం తరువాతి పరిణామాలకు పునాదులు వేసింది. ఆలోచనల మధనంతో తన మార్గాన్ని నిర్దిష్టం చేసుకుని, సామాజిక విప్లవంతో ముడివేసుకుని విప్లవ రచయితగా వికాసం పొందిన వాడు జ్వాలాముఖి. ఈ పరిణామ క్రమంలో తనను తాను ఎప్పటికప్పుడు ప్రాసంగికం చేసుకుంటూ, సత్వరంగా అవసరమైన మార్పులకు ఆహ్వానం పలికిన నిత్య చైతన్య శీలి జ్వాలాముఖి.
మెదక్ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన వీరవల్లి నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ దంపతులకు 1938 ఏప్రిల్ 12 న జన్మించిన జ్వాలాముఖి అసలు పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచార్య. తండ్రి హైదరాబాదు సీతారాం బాగ్ ఆలయంలో పౌరోహిత్యం చేసేవారు. ఆ గుడి ఆవరణ లోనే రాఘవాచారి బాల్యం గడిచింది. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ము డు వున్నారు. మల్లేపల్లి పాఠశాల, నిజాం కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఎం. ఏ తెలుగు, హిందీ భూషణ్ పట్టా పొందారు. తరువాత ఎల్.ఎల్.బీ. పూర్తిచేశారు. చాలా క్రమశిక్షణా యుతమైన జీవితం గడిపేవారు.

కొంతకాలం సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో సివిలియన్ స్కూలు మాస్టరుగా, ఏయిర్ ఫోర్సులో, అర్. టి. సి. లో క్లర్కుగా కూడా పని చేశారు. హైస్కూలు ఉపాధ్యాయుడిగా 12 ఏళ్లు విధులు నిర్వహించారు. తరువాత హైదరాబాదు లోని ఎల్. ఎన్. గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో 24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996 లో పదవీ విరమణ చేశారు. భార్య సీతాదేవి, ముగ్గురు కుమారులు, కోడళ్ళు మనవలు, మనవరాళ్ళతో ఈతి బాధలను ఈదుతూ కుటుంబ జీవితం గడిపారు.
ఆయన ఏనాడూ తన ఉద్యమ జీవిత ప్రస్థానం ఆపలేదు. సాహిత్య సృజన, సాంస్కృతిక ఉద్యమ బాధ్యతలు నిలిపి వేయలేదు.1958లో ’మనిషీ’ దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘం వారు కరుణశ్రీ చేతుల మీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. అలా మనిషీ కావ్యంతో సాహిత్య జీవితం ఆరంభించి, 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు ప్రచురించారు. ఆ తరువాత విప్లవ రచయితగా జీవితాంతం కవితలు, కథలు, వ్యాసాలు రాస్తూనే వున్నారు.

ఉద్యోగ సంఘాలతోనూ, ఉద్యోగ క్రాంతి, ఉపాధ్యాయ ప్రగతి వంటి పత్రికల తోనూ సత్సంబంధాలు కలిగి వుండే వారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, గ్రామీణ పేదల సంఘం సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు. సమకాలిక విప్లవ ఉద్యమ నిర్మాణంలో పాల్గొన్న విప్లవోద్యమాభిలాషి. భారత చైనా మిత్ర మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను, జాతీయ ఉపాధ్యక్షునిగాను బాధ్యతలు నిర్వహిస్తూ మైత్రీ ఉద్యమానికి ఎనలేని సేవ చేశారు. చైనాదేశాన్ని రెండు మార్లు సందర్శించి ఆయన కలకన్న సమసమాజ నిర్మాణంలో చైనా నిర్వహిస్తున్న అవిరళ కృషి గురించి అనేక సమావేశాలలో వివరించి చెప్పేవారు. భారత చైనాలు సామ్రాజ్య వాద శక్తులను నిశ్శేషం చేసే పోరాటాల వారసత్వాన్ని కొనసాగించాలని, ప్రపంచ శాంతి అభ్యుదయాలకు ఈ రెండు దేశాల మైత్రి అత్యంత అవసరం అని భావించి ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక మైత్రీ ఉద్యమాన్ని విస్తరింప జేయటానికి ప్రయత్నించారు. విద్యార్ధి సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, కుల నిర్మూలన సంఘాలు,నాస్తిక, హేతువాద సభలలో వక్తగా పాల్గొని తాను నమ్మిన విప్లవ చైతన్యం కలిగించేవారు.
ఆయనది స్వతహాగా తీవ్రంగా స్పందించే స్వభావం. తాను పెరిగిన గుడి వాతావరణంలో వున్న మూఢత్వాన్ని చిన్ననాటినుండే ప్రశ్నించేవారు. మతపెద్దలు చూపించే వివక్షతలను ఎదుర్కునేవారు.

యాజమాన్యపు అక్రమాలను, అన్యాయాలను కోర్టుల కీడ్చి సుదీర్ఘ న్యాయ పోరాటాలు కూడా చేశారు. వక్తగా ఆలోచనలను అభిప్రాయాలను ఎంత కచ్చితంగా, కత్తి వాదరగా చెప్పేవారో వ్యక్తిగా అంతకుమించి అందరితో ఆత్మీయంగా, స్నేహ పాత్రంగా వ్యవహరించే వారు. కవి, పండితుని గా ఎదుగుతూ పండిత పామర జనరంజకంగా భాషించిన ప్రజ్ఞా శాలి. సౌజన్యశీలి. స్వాతంత్య్రం పూదోటలో/అదుపు తప్పి ఎగబడ్డ/పదవీ రాజకీయాల గొడ్లని తన్ని తరిమి వేయ లేక పోతున్నసమాజం లోని పట్టనితనం పట్ల రోషంతో ఒక వికటాట్టహాసంగా పౌర ఫల్గుణుని విషాదయోగం గా జ్వాలాముఖి తొలి దశలో కవితలను పలికించారు. శతాబ్దాల పరిణామం ప్రగతిపై అనాదిగా పెరుగుతున్న అనంత మానవుడి ఇంగితాన్ని తన కవితల ఇంధనం గా చేసుకున్నారు.
మతాలు, కులాలు, ఉప కులాలు, జెండర్, ప్రాంతాలు స్థానిక వాదాలతో తలెత్తిన అనేక ఉద్యమాలను వాటికి దన్నుగా వచ్చిన స్త్రీవాదం, దళిత వాదం, ముస్లిం మైనారిటీ వాదం వంటి అనేక అస్తిత్వ సమూహాల సాహిత్యం పై ఆయన లోతుగా అధ్యయనం చేశారు. ఇతర వామపక్ష వాదులకు భిన్నమైన వైఖరి, చైతన్యం ప్రదర్శించారు. అయా సమూహాలు లేవనెత్తుతున్న సమస్యల లోని సమంజసత్వాన్ని, వాస్తవాన్ని గుర్తిస్తూ, గ్రహిస్తూనే ఆయా వాదాలు సమష్టి తత్వాన్ని, సమష్టి పోరాటాలను దెబ్బ తీస్తున్నాయని, పోరాడే ప్రజలను విడివిడి సమూహాలుగా విడగొడుతు న్నాయని, అవి ఏవో కొన్ని సంస్కరణలకు పరిమిత మవుతున్నాయని ఆయన భావించారు.

ఒక సంస్కారణాభిలాష నే గొప్ప విప్లవ దృక్పధంగా ప్రచారం చేస్తున్నారని నిజమైన విప్లవ చైతన్యాన్ని దెబ్బతీస్తున్నారని భావించారు. ఏకోన్ముఖంగా సాగవలసిన విప్లవోద్యమం బహు కోణాలలో చీలిపోవటాన్ని ఆయన వ్యతిరేకించారు. ఐదు వేళ్ళు కలిసి పిడికిలిగా మారటానికి బదులు పిడికిలి సడలిపోవటంగా ఈ పరిణామాలను ఆయన అర్ధం చేసుకున్నారు. ఐక్య ఉద్యమాల స్థానంలో విడి గ్రూపులు ఉనికిలోకి రావటం, అవి నిర్మించే ఉద్యమాలు బలహీనమైనవి కావటం, వాటిని ప్రభుత్వ వర్గాలు ఖాతరు చేయక పోవటం జరిగింది. లేదా ఆ ఉద్యమాలు పాలకుల ప్రాపకం కోసం అంగలార్చడం జరిగింది.ఉద్యమ లక్ష్యాలు కూడా పాలకుల కనుసన్నల మేరకే పరిమిత మయ్యాయి. జ్వాలాముఖి దార్శనికత్వానికి, విప్లవ చైతన్యానికి ఈ పరిణామాలు చక్కని ఉదాహరణగా భావించవచ్చు.
ఆయన చేసిన చర్చలు, తెలుగు సాహిత్య ఉద్యమాల లోనూ, మొత్తం సమాజం లోను అనేక అంశాలను రంగం మీదికి తెచ్చి ఒక నిశితమైన అభిప్రాయానికి రావటానికి తోడ్పడ్డాయి. నాస్తికుడిగా, మార్క్సిస్ట్ మేధావిగా, విప్లవకారునిగా ’ప్రత్యామ్నాయ సంస్కృతి ’ని అభివృద్ధి చేయడానికి ఆయన భావజాలం తోడ్పడింది. హైదరాబాదు వంటి నగరంలో ‘ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రం‘ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి ఆయన పలుమార్లు చెప్పేవారు.1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులు జైలు జీవితం గడిపారు.

1975 ఎమర్జెన్సీ కాలంలో కూడా 15 రోజులు జైల్లో ఉన్నారు. గుండెకు బైపాస్ ఆపరేషను జరిగినా, వయసు మీదపడుతున్నా లెక్క చేయక, నిత్యసంచారి గా అనేక రాష్ట్రాలు, ప్రాంతాలు తిరిగి వేలాది సభలలో పాల్గొంటూ, విప్లవ ప్రబోధకునిగా అవిశ్రాంత కృషి చేస్తూ- కాలేయ వ్యాధి ముదిరిపోయి అవయవాలు విఫలం చెందటం వల్ల డిసెంబర్ 14, 2008 న మరణించారు.
భూస్వామ్య సంస్కృతిని ఎదిరించే ఉద్యమాలతో కలిసి నడుస్తూ, సామ్రాజ్య వాదాన్ని ఎండగడుతూ, నూతన జనతా ప్రజాతంత్ర విప్లవ నిర్మాణానికి తోడ్పడుతూ ప్రయోజనకరమైన, సార్ధకమైన జీవితం గడిపి విప్లవకవి అన్న చిరునామాను జీవితాంతం నిలుపుకున్నారు. 14122023 న ఆ మహానీయుని 15 వ వర్ధంతి సందర్భంగా మననం చేసుకుంటూ నివాళి. పాలక సంస్కృతికి అమ్ముడుపోని ప్రజావాణిగా ధిక్కార స్వరంగా బతకడమే కవిలోకం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News