అస్సాం, మేఘాలయ వరదల్లో 16 మంది మృతి
న్యూఢిల్లీ: అసోం, మేఘాలయ రాష్ట్రల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రధాన నదులలో నీటి మట్టాలు పెరిగాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య రెండు రాష్ట్రాలలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర, గౌరంగ నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత జిల్లాల్లోని 19782.80 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 72 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,510 గ్రామాలు ప్రస్తుతం నీటిలో మునిగి ఉన్నాయి. అస్సాంలో వరదలకు దాదాపు 11 లక్షల మంది ప్రభావితం అయ్యారు.
వరుసగా మూడో రోజు కూడా నీటి కారణంగా రాజధాని గౌహతిలోని చాలా ప్రాంతాలు స్తంభించాయి. గౌహతి నగరంలో నూన్‌మతి ప్రాంతంలోని అజంతానగర్‌లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, కొండచరియలు కూడా విరిగిపడ్డాయి.