Wednesday, January 22, 2025

దవాఖానాల కాంట్రాక్టుల్లో దళితులకు ‘16%’

- Advertisement -
- Advertisement -

'16% 'for Dalits in hospital contracts

డైట్, శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీల్లో వర్తింపు
డ్రా పద్దతిలో రిజర్వ్ చేసిన ఆసుపత్రుల ఎంపిక
మొత్తం 56 ఆసుపత్రులను దళితులకు కేటాయింపు
ఎస్‌సిలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ప్రారంభించిన
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
దళితబందు కార్యక్రమం కాదు..ఒక ఉద్యమం : మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన దళితబందు కేవలం కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్‌సిలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, డిఎంఇ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సిఎం ఒఎస్‌డి గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు.

నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సిఎం కెసిఆర్ నిజం చేశారని తెలిపారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో ఎస్‌సి,ఎస్‌టిలకు 21 శాతం కేటాయిస్తూ జి.ఒ 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌ది అని పేర్కొన్నారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16 శాతం దళితులకు కేటాయిస్తున్నామని తెలిపారు. 100 పడకల లోపు హాస్పిటల్‌ను ఒక కేటగిరీగా, 100 పడకలకు పైగా ఉన్న హాస్పిటల్‌ను మరో కేటగిరీగా విభజించామని చెప్పారు. ఏయే హాస్పిటళ్లను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించామని అన్నారు. మొత్తం 56 ఆసుపత్రులను దళితులకు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని చెప్పారు. ఎస్‌సి యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్లు నిబంధనల్లో మార్పులు చేశామని, ఒక్క టెండర్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం ఒక్కో బెడ్‌కు ఇచ్చే చార్జీలను రూ.5 వేల నుంచి రూ. 7,500కు పెంచినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఏటా రూ.325 కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. అలాగే డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశామని తెలిపారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలోని కాంట్రాక్టుల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్లు కేటాయించడం చారిత్రక సందర్భం అని టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో జి.ఒ 59 ద్వారా నీటిపారుదల శాఖ టెండర్లలో ఎస్‌సి,ఎస్‌టిలకు 21 శాతం కేటాయించారని తెలిపారు.ఇప్పుడు మంత్రి హరీష్ రావు చొరవతో ఏజెన్సీలను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లు కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అంబేద్కర్ కల సాకారం చేయలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని చెప్పారు.

ఆసుపత్రుల వివరాలు

100 పడకలలోపు దవాఖానలు – 122

ఎస్‌సిలకు కేటాయించినవి – 20

100 నుంచి -500 పడకల దవాఖానలు – 53

ఎస్‌సిలకు కేటాయించినవి- 8

మొత్తం – 28

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News