సమాజంలో విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. ఒక విద్యార్థి భావితరాలకు మార్గనిర్దేశకులుగా నిలబడాలంటే ఉపాధ్యాయులు లేనిది ఏదీ సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలికంగా విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిఇఒ నిర్ణయం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు ఇది సరైన నిర్ణయమని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో దీర్ఘకాలికంగా తమ విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఒకరు స్కూల్ అసిస్టెంట్ కాగా మిగిలిన 15 మంది ఎస్‌జిటి ఉపాధ్యాయులు ఉన్నారు.
వీరంతా గత కొన్నేళ్లుగా 2005 నుంచి 2022 వరకు విద్యాశాఖ అధికారులకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. దీంతో వారిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డిఇఒ వెల్లడించారు. గతంలో ఐదుసార్లు నోటీసులు పంపించినా సదరు ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించి వారందరినీ సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశామని డిఇఓ తెలిపారు. తొలగింపునకు గురైనవారి వివరాలు : జిల్లా పరిధిలోని సర్వీసు నుంచి తొలగించినన ఉపాధ్యాయులు వరుసగా స్కూల్ అసిస్టెంట్ 1. గీతారాణి, ఎస్‌జిటిలు (సెకండరీ గ్రేడ్ టీచర్) 2. విజయలక్ష్మి, 3. శ్రీనివాస్‌రెడ్డి, 4. ఉమారాణి, 5. ప్రభాకర్‌రెడ్డి, 6. అబ్దుల్‌హమీద్, 7. స్వప్న, 8. మాధవి, 9. నవీన్‌కుమార్, 10. ఎం.ఉమాదేవి, 11. క్రాంతికిరణ్, 12. జె.ఉమాదేవి, 13. నర్సింహారావు, 14. శైలజ, 15. భాగ్యలక్ష్మి, 16. కిరణ్‌కుమారిలను సర్వీస్ నుండి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు