Sunday, December 22, 2024

అమెరికాలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

లెవిస్టన్ : మరోసారి సామూహిక కాల్పుల సంఘటనతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిల్లింది. మైనే రాష్ట్రం లోని లెవిస్టన్ నగరంలో బుధవారం రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం లెవిస్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. రద్దీగా ఉన్న ఈ ప్రాంతాల్లో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పులు జరిపిన తరువాత దుండగుడు పరారీ కావడంతో ఆ వ్యక్తి కోసం పోలీస్‌లు గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
హంతకుడు ఆర్మీలో మాజీ సభ్యుడే…
కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఫోటోను పోలీస్‌లు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పించాడు. గతంలో యూఎస్ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్ సభ్యుడిగా అతడిని అనుమానిస్తున్నారు. నిందితుడు 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. ఇతడు మైనే లోని యూఎస్ ఆర్మీ రిజర్వు ట్రైనింగ్ సెంటర్‌లో ఫైర్‌ఆర్మ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి రిటైర్ అయినట్టు పోలీస్‌లు తెలిపారు. గతంలో గృహహింస కేసులో అరెస్టయి, విడుదలయ్యాడని, ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మైనే ప్రాంతం లోనే ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

ప్రజలకు పోలీసులు హెచ్చరికలు
రాబర్ట్ కార్డ్ ఈ కాల్పులు జరపడానికి కారణం ఏమిటో ఇంకా తెలియలేదు. ఈ దిశగా పోలీస్‌లు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే రాబర్ట్ కార్డ్‌తో ప్రమాదం పొంచి ఉందని, అతడి వద్ద ఆయుధం ఉందని, అందువల్ల పౌరులు ఇళ్లలోనే ఉండాలని పోలీస్‌లు హెచ్చరికలు జారీ చేశారు. వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేసి, షట్టర్స్ క్లోజ్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతానికి 8 మైళ్ల దూరంలో లిస్బన్ ప్రాంతంలో ఓ అనుమానాస్పద కారును పోలీస్‌లు గుర్తించారు. అది నిందితుడిదే అయి ఉంటుందని భావిస్తున్నారు.
అధ్యక్షుడు జోబైడెన్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దిగ్భ్రాంతి చెందారు. మైనే రాష్ట్ర గవర్నర్ జానెత్ మిల్స్, అక్కడి సెనేటర్లతో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. ఫెడరల్ నుంచి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. గత సంవత్సరం మే 22 న కూడా అమెరికాలో సామూహిక కాల్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు టెక్సాస్ లోని ఉవాల్డేలో ఓ ఎలిమెంటరీ పాఠశాలలో ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News