జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కింగావ్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 15 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కూలీలతో వెళుతున్న ట్రక్కు బోల్తాకొట్టి రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడడంతో ఈ ఘోరం సంభవించింది. ధూలే నుంచి జల్గావ్‌లోని యవల్ తహసిల్‌కు వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. మృతులలో 3, 5 సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులు, ఒక 15 సంవత్సరాల బాలిక ఉన్నారు. ట్రక్కు పైన నిద్రిస్తున్న ఒక 14 ఏళ్ల బాలుడు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కూలీలంతా జల్గావ్ జిల్లాలోని అభోద, వివ్రా, కర్హాలా గ్రామాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఈ సంఘటనను దురదృష్టకరంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అభివర్ణించారు. గాయపడిన వారి చికిత్స ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు. సాంకేతిక వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసు అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక సమర్పించవలసిందిగా ఆర్‌టిఓ కార్యాలయాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన ప్రమాద స్థలిని చేరుకుని జెసిబి సాయంతో గోతిలో నుంచి ట్రక్కును బయటకు తీశారు. గాయపడిన ఐదుగురిలో ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నాడు. క్షతగాత్రులను జల్గావ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసు అధికారి చెప్పారు.