Monday, April 28, 2025

16 పాక్ యూట్యూబ్ చానెళ్లను నిషేధించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లు
డాన్, జియో న్యూస్ వంటి ప్రముఖ యూట్యూబ్ వార్తా చానెళ్లపై నిషేధం
పహల్గామ్ దాడిపై బిబిసి వార్తకు కూడా ఖండన
ఉగ్ర దాడి బదులు ‘తీవ్రవాదుల దాడి’ అని పేర్కొన్న బిబిసి

న్యూఢిల్లీ : భారత్ గురించి ‘తప్పుడు, రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన అంశాలను’ ప్రసారం చేస్తున్నాయనే ఆరోపణపై 16 పాకిస్తానీ యూట్యూబ్ చానెళ్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, అదే సమయలో పహల్గామ్ దాడిపై బిబిసి ప్రసారం చేసిన వార్తకు కూడా కేంద్రం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిందని అధికారులు సోమవారం వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక పట్టణం పహల్గామ్ మైదాన ప్రాంతంలో ఈ నెల 22ప ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. ఆ దాడిలో పర్యాటకులతో సహా 26 మంది వ్యక్తులు హతులైన విషయం విదితమే. ఉగ్రవాదులను తీవ్రవాదులుగా పేర్కొన్న బిబిసి ప్రసారం చేసే వార్తలను విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) పర్యవేక్షించనున్నదని అధికారులు తెలిపారు.

కేంద్రం నిషేధించిన పాక్ యూట్యూబ్ చానెళ్లు డాన్ న్యూస్, ఇర్షాద్ భట్టి, సమా టివి, ఎఆర్‌వై న్యూస్, బిఒఎల న్యూస్, రఫ్తార్, ది పాకిస్తాన్ రెఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్, జిఎన్‌ఎన్, ఉజెయిన్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్‌క్లూజివ్, ఆస్మా షిరాజి, మునీబ్ ఫారూఖ్, సునో న్యూస్, రజీ నామా. ‘జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో భారత్‌పైన, దాని సైన్యం, భద్రతా సంస్థలపైన రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన అంశాలను. అసత్య, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నందుకు పాకిస్తానీ యూట్యూబ్ చానెళ్లను హోమ్ మంత్రిత్వశాఖ సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది’ అని అధికారులు వివరించారు.

బిబిసి భారత్ అధిపతికి విదేశాంగ శాఖ లేఖ

పహల్గామ్‌లో ఇటీవలి భీకర ఉగ్ర దాడికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బిబిసి ప్రచురించిన ఒక కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ దాడిని ‘తీవ్రవాదుల దాడి’గా అభివర్ణించడాన్ని కేంద్రం ఆక్షేపిస్తూ, బిబిసి పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించింది. విదేశాంగ శాఖ ఈ మేరకు బిబిసి భారత్ విభాగం అధిపతి జాకీ మార్టిన్‌కు లేఖ రాసింది. ‘కాశ్మీర్‌లో దాడి తరువాత భారతీయులకు వీసాలనే పాకిస్తాన్ రద్దు చేసింది’ అనే శీర్షికతో బిబిసి ప్రచురించిన కథనంలో పహల్గామ్ ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొనడానికి బదులు ‘మిలిటెంట్ దాడి’ అని ప్రస్తావించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది వాస్తవాలను వక్రీకరించడమేనని, బాధితుల పట్ల అగౌరవాన్ని సూచిస్తుందని కేంద్రం తన లేఖలో పేర్కొన్నది.

ఉగ్ర దాడి తీవ్రతను తగ్గించి చూపే యత్నం చేశారని ప్రభుత్వం విమర్శించింది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని బిబిసికి సూచిస్తూ, ఈ నెల 22న పహల్గామ్‌లో జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా విదేశాంగ శాఖ తన లేఖతో పాటు పంపింది. ‘ఉగ్రవాదులను తీవ్రవాదులుగా పేర్కొనడంపై బిబిసికి ఒక లేఖ పంపడమైంది. ఎంఇఎ విదేశీ ప్రచార విభాగం బిబిసి వార్త పంపే తీరును పర్యవేక్షించనున్నది’ అని అధికారి ఒకరు తెలియజేశారు. ఆ రోజు పట్టపగలు, రద్డీగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News